తెలంగాణ గురించి కాంగ్రెస్ ఎప్పుడూ మాట్లాడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు. తెలంగాణ (Telangana) తో ఆ పార్టీకి ఆత్మబంధం అసలు సాధ్యం కాదన్నారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆ పార్టీ పదేండ్ల ఆలస్యం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ (CM KCR) వెంటే ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపామని చెప్పారు. ఈ పదేండ్ల కాలంలో తెలంగాణ హక్కుల గురించి రాహుల్ గాంధీ కనీసం ఒక్కసారైనా మాట్లాడారా ? అని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రజలను కాంగ్రెస్ అధిష్టానం మభ్య పెడుతోందని ఫైర్ అయ్యారు.
ఏదో రెండు, మూడు తాయిలాలు ప్రకటించినంత మాత్రాన కాంగ్రెస్ ను ప్రజలు నమ్మరని ఆమె దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తొమ్మిది మండలాలను ఏఫీలో కలుపుతున్న సమయంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎన్నో ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉందన్నారు.
కనీసం ఈ పార్లమెంట్ నూతన భవనంలోనైనా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ నెల 20న ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు.