బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ, కల్వకుంట్ల కవిత (MLC Kavitha) దాఖలు చేసిన పిటీషన్ (Petition)పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో తనను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడంతో కవిత ఈ పిటీషన్ దాఖలు చేశారు. మహిళలను కార్యాలయానికి పిలవకుండా, వారి ఇంట్లోనే విచారణ చేసేలా ఆదేశాలివ్వాలని కవిత తన పిటీషన్ లో కోరారు.
కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. రెండు వేర్వేరు కేసుల్లో గత ఉత్తర్వులను పరిశీలించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. గత విచారణ సందర్భంగా నళిని చిదంబరం కేసుతో జతపరిచిన సర్వోన్నత న్యాయస్థానం, ఇవాళ మరోసారి విచారణ చేపట్టి తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేస్టునట్లు ప్రకటించింది. మరోవైపు ఈడీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది.
ఇప్పటికే పలువురు ప్రముఖులను అరెస్టు చేసింది. మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారించింది. ఇందులో భాగంగా కవితను కూడా ఇప్పటికే పలుమార్లు విచారించింది. అయితే మరోసారి విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళల విచారణలో ఈడీ.. సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ తనపై ఎలాంటి బలవంతపు చర్యలకు పాల్పడకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా గత కొద్ది నెలలుగా ఈ కేసులో సుప్రీం కోర్టు విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం కవిత వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈడీ తరఫు న్యాయవాది.. కవిత సమన్లు తీసుకోవట్లేదని, విచారణకు రావట్లేదన్న కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే కవిత తరఫు న్యాయవాది కపిల్ సిబల్, సమన్లు జారీ చేయబోమని గత విచారణలో ఈడీ తెలిపినట్టు వెల్లడించారు. దీనికి సమాధానంగా సమన్లు జారీ చేయబోమనేది ఒక్కసారికే కానీ, ప్రతిసారి కాదని ఈడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు.