మహిళా రిజర్వేషన్ల చట్టం ఒక పోస్ట్ డేటెడ్ (Post Dated Check) చెక్కు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kalvakuntla Kavitha) అన్నారు. పార్లమెంట్ ఆమోదం లభించిన తర్వాత కూడా రిజర్వేషన్ల చట్టం అమలు కావడం లేదని తెలిపారు. కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ మహిళా రిజర్వేషన్ల ద్వారా ప్రయోజనాలు పొందాలని ప్రయత్నించిందన్నారు.
బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ‘ఎక్స్‌ప్లోరింగ్ ఇన్‌క్లూసివ్ డెవలప్‌మెంట్-ది తెలంగాణ మాడల్’అనే అంశంపై కవిత ప్రసంగించారు. భారత్‌కు తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని అన్నారు. స్వల్ప కాలంలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు.
అహింసా మార్గంలో తెలంగాణను సాధించిన గాంధీ సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. బీడు వారిన భూములను పచ్చని పంట పొలాలుగా తీర్చిదిద్ది దేశానికి స్ఫూర్తినిచ్చారని వెల్లడించారు. ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ అన్ని రాష్ట్రాల కన్నా ముందుకు ఉందన్నారు. తెలంగాణ మోడల్ అంటే ఆర్థిక గణాంకాలు కాదన్నారు. అది మారిన తెలంగాణ జీవన స్థితి గతులని వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉండేదన్నారు. 2700 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉండేదన్నారు. సరైన విద్యుత్తు సౌకర్యాలు లేక పరిశ్రమలను వారంలో రెండు రోజులపాటు మూతబడి ఉండేవన్నారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉండేదన్నారు. స్వరాష్ట్రంలో సమూలమైన సంస్కరణలు తీసుకు వచ్చి పూర్తిగా ఆ పరిస్థితులను కేసీఆర్ మార్చి వేశారన్నారు.
జాతీయ సగటుకు మించి తెలంగాణ పయనిస్తోందన్నారు. జీఎస్‌డీపీలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యే సమయానికి రూ.112162 ఉన్న తలసరి ఆదాయం 2022-23 నాటికి రూ.3,14,732కి పెరిగిందన్నారు. తలసరి ఆదాయం పెరుగుదలలో ఇతర రాష్ట్రాలకు మించి దూసుకెళ్తొందన్నారు.
చివరి గింజ వరకు పంటను బీఆర్ఎస్ సర్కార్ కొనుగోలు చేస్తోందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడున్నరేండ్లలోనే పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. 2014లో రూ.62 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు రూ. 2 లక్షల 94 వేల కోట్లకు చేరిందన్నారు. పరిశ్రమల ఏర్పాటును వేగవంతంగా అనుమతులు ఇస్తున్నామన్నారు. టీఎస్ ఐపాస్ విధానం ద్వారా కేవలం 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని చెప్పారు.