ఈ మధ్య కాలంలో సెల్ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా పిల్లలు సెల్ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో యూకే ప్రభుత్వం(UK Government) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ప్రవర్తన, శ్రద్ధను మెరుగుపరిచేందుకు పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల(Mobile Phones) వినియోగాన్ని నిషేధించాలని నిర్ణయించింది.
ఈ మేరకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(British Prime Minister Rishi Sunak) సోమవారం సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందుబాటు మొబైల్ ఫోన్ల వల్ల పిల్లలపై పడే ప్రభావాన్ని వివరించారు. క్లాస్ రూములలో అంతరాయాలను తగ్గించడంతోపాటు విద్యార్థుల ప్రవర్తనను మెరుగుపరిచే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
‘మొబైల్ ఫోన్లు చాలా ప్రభావం చూపుతున్నాయి. సెకండరీ స్కూల్ విద్యార్థుల్లో మూడింట ఒకవంతు తమ పాఠాలకు ఫోన్ల వల్ల అంతరాయం కలుగుతోంది. ఫోన్ల కారణంగా తరగతి గదిలో వారు చదువుపై దృష్టి సారించడం లేదు. చాలా పాఠశాలలు ఇప్పటికే ఫోన్లు నిషేధించాయి. దేశవ్యాప్తంగా ఇది పాటించాలి.’ అని రిషి సునాక్ ఆ వీడియోలో తెలిపారు.
అదేవిధంగా పాఠాలు నేర్చుకునే పిల్లలకు పరధ్యానం ఉండరాదని బ్రిటన్ విద్యాశాఖ మంత్రి గిలియన్ కీగన్ పేర్కొన్నారు. బ్రేక్, లంచ్ సమయంలో కూడా మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. సురక్షితమైన, మెరుగైన విద్యావతావరణానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులు నిర్బంధం ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.