రాజస్థాన్లో ఎన్డీటీవీ (NDTV) నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ కన్నా ప్రతిపక్ష బీజేపీ (BJP) వైపే అత్యధిక మంది ఓటర్లు చూస్తున్నట్టు ఒపీనియన్ పోల్లో తేలింది. మరోవైపు రాష్ట్రంలో ప్రధాని మోడీ చరిష్మా ఎక్కువగా పని చేస్తుందని సర్వే పేర్కొంది. ఈ ఎన్నికల్లో సీఎం అశోక్ గెహ్లాట్ కన్నా ప్రధాని మోడీ చరిష్మా ఎక్కువ పని చేస్తుందని వెల్లడించింది.
రాష్ట్రంలో మొత్తం 30 నియోజక వర్గాల్లో 3000 మందిని ఎన్డీటీవీ సర్వే చేసింది. సర్వే ప్రకారం సీఎం అశోక్ గెహ్లాట్ ను చూసి ఓటు వేస్తామని 32 శాతం, ప్రధాని మోడీని చూసి ఓటు వేస్తామని 37 శాతం మంది తెలిపారు. రాష్ట్రంలో పెరిగిన అవినీతి, ధరల పెంపు, నిరుద్యోగం సమస్యను పరిష్కరించడంలో గెహ్లాట్ సర్కార్ విఫలం కావడంతో బీజేపీకి భారీగా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.
ఇక సీఎం అశోక్ గెహ్లాట్ పాలనపై సంతృప్తిగా ఉన్నామని 43 శాతం మంది తెలిపారు. అదే సమయంలో 28 శాతం మంది కాస్త సంతృప్తిగా, పది శాతం మంది కాస్త అసంతృప్తిని, 14 శాతం మంది పూర్తి స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎంగా అశోక్ గెహ్లాట్ వైపు 27 శాతం, వసుంధర రాజే వైపు 14శాతం, సచిన్ పైలట్ వైపు 9 శాతం, గజేంద్ర షకావత్ వైపు 6 శాతం మంది మొగ్గు చూపారు.
ఈ ఎన్నికల్లో బీజేపీకి రాజ్ పుత్రుల, దళితులు మద్దతుగా నిలిచే అవకాశం ఉన్నట్టు చెప్పింది. రాజపుత్రులో 55 శాతం మంది, దళితుల్లో 46 శాతం మంది సర్వేలో బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు. ఇక ఓబీసీల్లో 45 శాతం మంది బీజేపీకి మద్దతిస్తామన్నారు. అవినీతిపై పోరాటంలో కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీ బెస్ట్ అని సర్వేలో వెల్లడైంది.