Modi : దేశ 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న సందర్బంగా ప్రధాని మోడీ (Modi) గత ఏడాదిలాగే దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరిన ఆయన.. ప్రజలంతా సామాజిక మాధ్యమాల్లో కనిపించే ప్రొఫైల్, డిస్ ప్లే పిక్చర్లల్లో త్రివర్ణ పతాక పోస్టర్ ను ఉంచాలని సూచించారు. అలాగే x లో (ఇదివరకటి ట్విట్టర్ లో) తన డీపీని మార్చేశారు. హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) ఉద్యమ స్ఫూర్తితో సోషల్ మీడియా ఖాతాల డీపీని మార్చడం ద్వారా ఈ దేశానికి, మనకు మధ్య గల బంధాన్ని మరింత బలోపేతం చేద్దామన్నారు. స్వేచ్ఛ, జాతీయ ఐక్యతకు జాతీయ పతాకంప్రతీక.. హర్ ఘర్ తిరంగా వెబ్ సైట్ లో తిరంగాతో ఉన్న మీ ఫోటోలను అప్ లోడ్ చేయండి అని ఆయన అన్నారు. ఈ అసాధారణ ప్రయత్నానికి అందరం చేతులు కలుపుదాం అని ట్వీట్ చేశారు.
ఇక అప్పుడే దేశంలో పలు చోట్ల హర్ ఘర్ తిరంగా ర్యాలీలు మొదలయ్యాయి. ఢిల్లీలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఈ ర్యాలీని ప్రారంభించగా ఇతర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి, అరుణ్ రామ్ మేఘ్ వాల్ తదితరులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ నెల 11 నే తిరంగా ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం ఉదయం ఈ ర్యాలీని ప్రారంభించారు.
శ్రీనగర్ లోని షేర్-ఏ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ నుంచి దాల్ సరస్సు సమీపంలోని బొటానికల్ గార్డెన్ వరకు ర్యాలీ సాగింది. పెద్ద సంఖ్యలో స్కూలు విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. గుజరాత్ లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తిరంగా ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది జాతీయ జెండాతో కవాతు చేశారు. మధ్యప్రదేశ్ లోకని చతార్ పూర్ లో ప్రజలు దేశభక్తి గీతాలు పాడుతూ ర్యాలీలో పాల్గొన్నారు.
హర్ ఘర్ తిరంగా ఉద్యమ ప్రచారాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా పోస్టాఫీసులకు దాదాపు రెండున్నర కోట్ల జాతీయ పతాకాలను సరఫరా చేసినట్టు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల కార్యదర్శి గోవింద్ మోహన్ తెలిపారు. గత సంవత్సరం మాదిరే ఈ ఏడాది కూడా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.