హైదరాబాద్ (Hyderabad) కు చెందిన స్కూల్ విద్యార్థిని ఆకర్షణ సతీష్ (Akarshana Satish) ను మోదీ మన్ కీ బాత్ (Man ki Bhat) కార్యక్రమంలో ప్రశంసించారు. ఆకర్షణ సొంతంగా ఏడు గ్రంథాలయాలను స్థాపించడాన్ని ఆయన అభినందించారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం ఆమె కృషి చేస్తున్న తీరు స్ఫూర్తి నింపుతోందని కొనియాడారు.
హైదరాబాద్‌లో ఏడో తరగతి చదువుతున్న ఆకర్షణ సతీష్ 11 ఏళ్ల వయసులోనే.. ఏకంగా ఏడు లైబ్రరీలను నిర్వహిస్తోంది. రెండేళ్ల క్రితం తల్లిదండ్రులతో కలిసి క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లిన సందర్భంలో ఆకర్షణ స్ఫూర్తి పొందినట్లు తెలిసిందని ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో అన్నారు. అక్కడ తీసుకున్న నిర్ణయంతో వివిధ రకాల పుస్తకాలను సేకరించడం మొదలు పెట్టారని చెప్పారు. క్యాన్సర్ ఆసుపత్రిలోనే పిల్లల కోసం మొదటి లైబ్రరీ ఏర్పాటు చేసిన ఆకర్షణ సతీష్, ఇప్పటి వరకు ఏడు లైబ్రరీలను ప్రారంభించారు. ఆ లైబ్రరీలలో ఇప్పుడు సుమారు 6 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అని ప్రధాని మన్ కీ బాత్ లో తెలిపారు.
బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న ఆకర్షణ సతీష్.. అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని కలలు కంటోంది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా మొత్తం 10 లైబ్రరీలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నానని తెలిపింది. మా నాన్నతో 2021లో ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో పిల్లలకు భోజనం ప్యాకెట్లు అందించడానికి వెళ్లా.. అక్కడి పిల్లలు నన్ను కలర్ బుక్స్, డ్రాయింగ్ షీట్లు తీసుకురావాలని అడిగారు. అప్పుడే లైబ్రరీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందని ఆకర్షణ తెలిపింది.
హైదరాబాద్ సనత్‌నగర్‌కు చెందిన డాక్టర్ సతీష్…మాజీ రాష్ట్రపతి డా. అబ్దుల్ కలాం స్థాపించిన లీడ్ ఇండియా ఫౌండేషన్.. కర్ణాటక, తమిళనాడు ఇంఛార్జ్‌గా పనిచేస్తున్నారు. డాక్టర్ సతీష్ కుమార్తె ఆకర్షణ సతీష్. సతీష్ కోరిక మేరకు అబ్దుల్ కలామే స్వయంగా ఈ చిన్నారికి ఆకర్షణ అని పేరు పెట్టటం విశేషం.
హైదరాబాద్ వరదల సమయంలో.. తన తండ్రి ఇచ్చిన పాకెట్ మనీని దాచుకోగా పోగైన 2 వేలను సీఎం సహాయ నిధికి పంపించింది ఆకర్షణ. అస్సాం వరదల సమయంలోనూ స్వచ్ఛందంగా విరాళాలు సేకరించింది. ఆకర్షణ చేస్తున్న సహాయ కార్యక్రమాలను గుర్తించి.. గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌కు పిలిచి మరీ అభినందించారు. అంతేకాదు.. మంత్రి కేటీఆర్ చేత కూడా అభినందనలు పొందింది ఈ చిన్నారి.