లోక్‌సభ ఎన్నికల(Loksabha Elections)వేళ కర్ణాటక(Karnataka)లో భారీగా నగదు, బంగారం బయటపడింది. బళ్లారి జిల్లాలోని ఓ వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా రూ.7.6 కోట్ల నగదు, బంగారు, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. అనంతరం వాటిని సీజ్ చేశారు. బళ్లారిలో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం మేరకు బ్రూస్‌పేట్ పోలీసులు రంగంలోకి దిగారు.
స్థానిక ఆభరణాల వ్యాపారి నరేశ్ సోనీ ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ రూ.5.6 కోట్ల కరెన్సీ, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలు, 3 కిలోల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో డబ్బు, నగలను హవాలా మార్గం ద్వారా తీసుకొని వచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యాపారి నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి అందజేస్తామని, అనంతరం ఐటీ అధికారులు దీనిపై తదుపరి దర్యాప్తు చేపడతారని తెలిపారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలుండగా ఏప్రిల్ 26, మే 4వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.
కర్ణాటకలోని చామరాజనగర్‌లో భారీ స్థాయిలో అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు అధికారులు. రూ.99 కోట్ల విలువ చేసే బీర్ల కాటన్లను అధికారులు సీజ్ చేశారు. గుర్తుతెలియని వ్యక్తి నుంచి చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల అధికారి సీటీ శిల్పనాగ్కు వచ్చిన ఆధారంగా సోదాలు నిర్వహించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
అదే విధంగా మైసూర్ జిల్లా నంజనగూడు మండలం తాండ్యా ఇండస్ట్రియల్ ఏరియాలోని యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ యూనిట్లో రూ.98.52 కోట్ల విలువైన బీర్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఎన్నికల తనిఖీల్లో భాగంగా కోలార్ జిల్లాలోని నంగలి స్టేషన్ పోలీసులు కారులో తరలిస్తున్న పలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి కారులో నుంచి 1200 జెలటిన్ స్టిక్స్, వైర్లతో నిండి ఉన్న 7 బాక్సులు, 6 డెటొనేటర్స్ను పట్టుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.