ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని మింగేసింది కరోనా (Covid-19). ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. అయితే.. కరోనాని కంట్రోల్ చేసినా.. కొందరు పలు ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. వాటిలో మరీ ముఖ్యంగా గుండెపోటు ఒకటి. ఈ రోజుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా హార్ట్ (Heart) కి ఎటాక్ తప్పడం లేదు. తీసుకునే ఆహారం, వాతావరణ కాలుష్యం ఇలా అనేక కారణాలతో మనిషి గుండెకు పోటు కామన్ అయిపోయింది. తాజాగా బాలింత గుండెపోటుతో చనిపోవడం అందరికీ కన్నీరు తెప్పిస్తోంది.
వరంగల్ (Warangal) జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన సుస్మిత.. ఈనెల 13న ప్రసవం కోసం వరంగల్ సీకేఎం (CKM) ఆస్పత్రిలో చేరింది. ఈనెల 16న మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, శిశువుకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రిలోని నవజాత శిశుసంరక్షణ కేంద్రంలో చేర్చారు. శిశువుకు అక్కడ చికిత్స చేయిస్తుండగా.. సుస్మిత సీమాంక్ వార్డులో బాబుకు పాలిచ్చేది. ఈక్రమంలోనే బిడ్డకు పాలు ఇస్తుండగా గుండెపోటుతో కుప్పకూలింది.
కుటుంబ సభ్యులు డాక్టర్లకు విషయాన్ని చేరవేశారు. వారు ఆమెను పరీక్షించగా గుండెపోటు వచ్చినట్లు గుర్తించారు. సీపీఆర్ చేసి బతికేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే సుస్మిత చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అతి చిన్న వయసులోనే చనిపోయిందని తెలిసిన వాళ్లు అయ్యో అని అంటున్నారు.
తల్లి చనిపోవడంతో బాబు తల్లి ప్రేమను కోల్పోయాడు. పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్నాడు. బిడ్డ ఏడుస్తుండటంతో ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అదిచూసిన వారంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా కన్నీరుమున్నీరయ్యారు.