సందేశ్ కాళీ ఘటన విషయంలో బీజేపీ (BJP)పై పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Benarjee) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సందేశ్ కాళీలో జరిగిన గోరంత ఉంటే దాన్ని బీజేపీ కొండంత చేసి చూపిస్తోందని ఫైర్ అయ్యారు. టీఎంసీ నేతలపై లైంగిక వేధింపుల, భూకబ్జా ఆరోపణలను వచ్చాయని, వాటిపై దర్యాప్తు జరిపేందుకు అధికారులను అక్కడకు పంపిస్తున్నామని తెలిపారు.
టీఎంసీ నేతలు ఎవరైనా భూమిని అక్రమంగా ఆక్రమించుకుంటే దాన్ని తిరిగి గిరిజనులకు ఇచ్చేస్తామని చెప్పారు. తానెప్పుడూ అన్యాయాన్ని సమర్ధించలేదని చెప్పారు. ఏ మహిళ కూడా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయలేదని వెల్లడించారు. కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించానని అన్నారు. తమ బ్లాక్ ప్రెసిడెంట్‌ని పోలీసులు అరెస్టు చేశారని వివరించారు. ఇలాంటి కేసుల్లో ఎంత మంది బీజేపీ నేతలను అరెస్టు చేశారు? అని ప్రశ్నించారు.
బీజేపీ పాలన ఇందిరాగాంధీ కాలం నాటి ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, దర్యాప్తు సంస్థలను దుర్వినయోగం చేస్తూ తమ నేతలను అరెస్ట్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం చేతులు కలిపాయని ఆరోపణలు గుప్పించారు. ఇందిరా గాంధీ కూడా ఓడిపోయారనే విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని అన్నారు.
1975-77లో ఎమర్జెన్సీ కాలంలో 2000 మందిని అరెస్టు చేశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలుస్తామని ఇందిరా గాంధీ దీమా వ్యక్తం చేశారని తెలిపారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పారు. ఇప్పుడు ఈడీని, సీబీఐని ఎన్నికల కోసం బీజేపీ ఉపయోగిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ రోజు కూడా సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్‌ను ఉపయోగించి ప్రజలను జైళ్లో పెట్టడాన్ని వ్యతిరేకించే హక్కు మనకు ఉందన్నారు.