ఆఫ్రికా(Africa) దేశం మొజాంబిక్(Mozambique)లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పడవ మునిగి 90 మంది గల్లంతయ్యారు. ఆ దేశ ఉత్తర తీరంలో పడవ మునిగిపోవడంతో పదుల సంఖ్యలో మరణాలు సంభవించి ఉండవచ్చని స్థానిక అధికారులు తెలిపారు.
దాదాపుగా 130 మందితో ఉన్న ఫిషింగ్ బోట్(Fishing Boat) నాంపులా ప్రావిన్స్‌లోని ఒక ద్వీపానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని వారు ప్రాణాలతో బయటపడే ఛాన్స్ లేదని నాంపుల ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ నెటో చెప్పారు.
ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే సముద్రంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా మృతదేహాల వెలికితీత కష్టంగా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటైన మొజాంబిక్‌లో గత అక్టోబర్ నుంచి 15 వేల కలరా కేసులు నమోదవగా, 32 మంది చనిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
ఎక్కువగా నంపులా ప్రావిన్స్ ప్రభావితమైంది. కలరా కేసుల్లో మూడో వంతు కేసులు ఇక్కడే నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆ వ్యాధి బారినుంచి తప్పించుకోవడానికి దీవుల్లోకి వెళుతుండగా ఈ పడవ మునిగిందని జైమ్ నెటో చెప్పారు. బోటులో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉండటం, ఎక్కువ మందిని తీసుకెళ్లడానికి అనువుగా లేకపోవడంతోనే ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే పడవ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేపట్టారు.