ఎంపీ గల్లా జయదేవ్(MP Galla Jayadev) షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తాను 2024 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. గుంటూరు(Gunturu)లో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆదివారం ఆయన ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు రుణపడి ఉంటానన్నారు.
చివరి మూడు సంవత్సరాలుగా తాను క్షేత్ర స్థాయిలో అందుబాటులో లేకున్నా పార్లమెంట్‌లో గుంటూరు ప్రజలకు ఏం చేయాలో అవి చేస్తూనే ఉన్నానని చెప్పారు. తాత రాజగోపాల్ నాయుడు వారసత్వంగా ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని ఆయన వెల్లడించారు. ఎంపీగా రెండు సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
‘నా వ్యాపారాలు దాని మీద ఆధారపడ్డ వాళ్ళని కూడా నేను చూసుకోవాలి. నా కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. అందుకే రాజకీయ విరామం తీసుకుంటున్నా’ అని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో కొన్ని వ్యవస్థలు ఫుల్ టైం, కొన్ని వ్యవస్థలు పార్ట్ టైం పని చేస్తాయని గల్లా వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో కేవలం 24 శాతమే పూర్తి స్థాయిలో పని చేసే పార్లమెంట్ సభ్యులు ఉన్నారని మిగిలిన వారు ఏదో ఒక రంగంలో కొనసాగుతూ రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
ఏపీ రాజధానిగా అమరావతి అవడానికి తన వంతు కృషి చేశానన్నారు. మన తోటి రాష్ట్రాల రాజధానులు సమాన దూరం ఉండేలా విజయవాడ, గుంటూరు ప్రాంతాల మధ్య రాజధాని ఏర్పాటు చేశామన్నారు. అమరావతి ఉద్యమంలో తనపై దాడి చేసినా, వ్యాపారాలను దెబ్బతీసినా భయపడలేదన్నారు. వ్యాపార అనుమతులకు 70రకాలుగా ప్రభుత్వ అనుమతులు అవసరమవుతాయని తెలిపారు. వ్యాపారుల మీద ప్రభుత్వాలు కక్ష కట్టకూడదని అన్నారు.
24 శాతం మంది వ్యాపారులు రాజకీయ వేత్తలుగా ఉన్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వ్యాపారులపై కక్ష గడితే ఎలా అని ప్రశ్నించారు. తమ తాతల నాటి నుంచి దేశమంతా ఇదే పరిస్థితి ఉందని గల్లా జయదేవ్ అన్నారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తే ఫుల్ టైం రాజకీయ నాయకుడిగా వస్తానని ఆయన స్పష్టం చేశారు. రాముడు, పాండవులు, వనవాసం తర్వాత ఎంత బలంగా వచ్చారో తాను కూడా అంత బలంగా రాజకీయాల్లోకి వస్తానన్నారు.