చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దామగుండం (Damagundam) నేవీ రాడార్ స్టేషన్ ( navy radar Station) ఏర్పాటుపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ రాడార్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉదృతం చేయాలని భావిస్తున్నాయి.
తాజాగా దామగుండంలో నేవీ రాడార్ నిర్మాణాన్ని చేపట్టవద్దని కేంద్రానికి బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలని కోరారు. రాడార్‌ను వేరే ప్రాంతంలో నిర్మించాలన్నారు. లోక్ సభలో ఈ అంశాన్ని రూల్ 377 కింద లేవనెత్తారు ఎంపీ.
ఈ రాడార్ స్టేషన్ వల్ల ప్రజల ఆరోగ్యంపైన ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. నిర్మాణం పూర్తయ్యాక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణం చేపడితే దాని వల్ల 400 ఏండ్ల పురాతనమైన రామ లింగేశ్వర స్వామి ఆలయం, విలువైన అటవీ, ఔషధ వృక్షాలు కాలగర్భంలో కలిసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టుపై పూడురు మండల ప్రజలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని వెంటనే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. నేవీ రాడార్ స్టేషన్‌ను అక్కడి నుంచి మార్చి వేరే అనువైన మరో ప్రాంతానికి మార్చాలని విజ్ఞప్తి చేశారు.