కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) త్వరలో వైసీపీ(YCP) కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారు. ఈనెల 14వ తారీఖున తాను వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(CM Jaganmohan Reddy) ఆధ్వర్యంలో వైసీపీలో చేరబోతున్నట్లు పేర్కొన్నారు. ఆ లేఖలో ‘‘ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీడియా ద్వారా అందరికీ తెలుసు. సీఎం జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్సీపీలోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నాను.’’ అని తెలిపారు.
అదేవిధంగా మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద వైఎస్ జగన్‌ను కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పని చేస్తానని ముద్రగడ వెల్లడించారు. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధిని సీఎం జగన్ చేయించాలని ఆశతో ఉన్నానని తెలిపారు.
ప్రజల బిడ్డ అయిన తాను ఎప్పుడూ తప్పు చేయలేదని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీన కిర్లంపూడి నుంచి తాడేపల్లికి బయల్దేరతానని తెలిపారు. అవకాశాన్ని బట్టి ప్రయాణంలో తమతో తాడేపల్లికి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.