సినిమాలో సన్నివేశాన్ని తలపించేలా ఉన్న యాక్సిడెంట్ ముంబై అటల్ సేతు పై జరిగింది. అయితే ఇక్కడ ఇది ఫస్ట్ యాక్సిడెంట్ అని తెలియచేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై (Mumbai) ట్రాన్స్ హార్బర్ లింక్ (Trans Harbor Link).. ఈ వంతెనపై హైస్పీడ్‌తో వెళ్తున్న ఓ కారు పల్టీలు కొడుతూ వంతెన రెలింగ్‌ను ఢీ కొట్టింది.
అచ్చం హాలీవుడ్ సినిమాలో సీన్ తలపించేలా ఉన్న ఈ ప్రమాద సంఘటనకు సంబంధించిన విజువల్స్ వెనుక వస్తున్న మరో కారు డ్యాష్ క్యామ్‌లో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social media)లో వైరల్‌గా మారింది. ఆదివారం మధ్యాహ్నం ముంబయి నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని చిర్లేకు వెళుతున్న కారు అటల్ సేతుపైకి చేరుకోగానే.. ముందు వెళుతున్న మరో వాహనాన్ని దాటేందుకు యత్నించింది. దీంతో అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది.
అయితే కారులో ఉన్నవారు గాయాలతో బయటపడినట్టు సమాచారం. నిజానికి వారు అదృష్టవంతులుగా పేర్కొంటున్నారు.. లేదంటే ఆ వాహనం సముద్రంలో పడేదని ఈ ఘటన చూసిన వారు వెల్లడిస్తున్నారు.. ఇక గాయపడిన మహిళలు, చిన్నారులను ముంబయి ట్రాఫిక్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని నవశేవాను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనను జనవరి 12న ప్రధాని మోదీ ప్రారంభించారు.
ముంబయి ట్రాన్స్‌హార్బర్ లింక్ ’ (MTHL)గా పిలుచుకొనే ఈ వంతెన రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని గంటన్నర నుంచి 20 నిమిషాలకు తగ్గించింది. ఆరు లేన్లుగా నిర్మించిన ఈ వంతెనపై గరిష్ఠ వేగం 100 కి.మీ.లు కాగా, కనిష్ఠ వేగం 40 కి.మీ.లుగా నిర్దేశించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదు. దీని మొత్తం పొడవు 21.8 కి.మీ.లు కాగా.. 16 కి.మీ.లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉండటం విశేషం.