Mumbai: బంగారం, వజ్రాలు, మాదకద్రవ్యాలు, చివరకు పాముల వంటి సరీసృపాలనుకూడా కస్టమ్స్ అధికారుల కళ్లబడకుండా తరలించడం సాధ్యమయ్యే పని కాదని అంటున్నారు. తాజాగా ముంబైలోని కస్టమ్స్ అధికారులు దుబాయ్ కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి నుంచి 1559.6 క్యారట్ల వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. సహజ సిద్ధమైన వీటిని ల్యాబ్ లో తయారు చేసినట్టు కనుగొన్నారు.
వీటి విలువ రూ. 1.49 కోట్లని, వీటిని టీ ప్యాకెట్ లో దాచాడని వారు తెలిపారు, నిందితుడిని జుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. దీనిపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని పోలీసులు, కస్టమ్స్ సిబ్బంది చెప్పారు.
ఈ నెల 9 న పట్టుబడిన ఇతగాడు భారతీయుడేనని తెలిసింది. అంతకు ముందు కొచ్చిన్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇండిగో విమానం లోని టాయిలెట్ లో దాచిన 85 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రెండు బ్యాగుల్లోపేస్ట్ రూపంలో దీన్ని దాచినట్టు కనుగొన్నారు. దీని బరువు 1709 గ్రాములు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే నిందితుడెవరన్నది ఇప్పటివరకు తెలియలేదు.