నిర్మల్ (Nirmal) జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar Office) కార్యాలయానికి మున్సిపల్ అధికారులు తాళం వేశారు. పట్టణంలో ఓ ప్రైవేట్ భనవంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నడుస్తోంది. ఆ భవన యజమాని రూ. 1 లక్షకు పైగా ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భవన యజమానికి అధికారులు నోటీసులు పంపించారు.
పన్ను చెల్లించాలంటూ ఇప్పటికే భవన యజమానికి పలు మార్లు నోటీసులు పంపించామని అధికారులు వెల్లడించారు. కానీ భవన యజమాని నుంచి ఎలాంటి స్పందన రావడం లేదన్నారు. ఆస్తి పన్ను బకాయి భారీగా పెరిగిపోవడంతో తాజాగా భవన సముదాయంలోని కార్యాలయంతో పాటు వ్యాపార సంస్థలకు అధికారులు తాళం వేశారు.
ఈ క్రమంలో కార్యాలయం ఎదుట సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది, వినియోగదారుల సుమారు రెండు గంటల పాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయంలో లావాదేవీలు నిలిచి పోయాయి. ఈ క్రమలంలో చివరకు మద్యాహ్నం 12 గంటలకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ తాళాలను అధికారులు తెరిచారు.
నిర్మల్లో ఆస్తి పన్ను బకాయిల వసూలు విషయంలో ఉదాసీనత పనికిరాదని ఇటీవల జిల్లా పాలనాధికారి ఆశీస్ సాంఘ్వాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ అధికారులు మొండి బకాయిల వసూలుపై దృష్టి సారించారు. పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న వారిపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.