మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanmantarao) ఎట్టకేలకు బీఆర్ఎస్ (BRS) పార్టీని వీడారు. ఈ మేరకు ఓ వీడియో ద్వారా రిజైన్ చేసినట్టు స్పష్టం చేశారు. ‘‘అందరికీ నమస్కారం. మల్కాజ్ గిరి ప్రజల కోరిక మేరకు, కార్యకర్తల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా శ్రేయోభిలాషుల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. త్వరలోనే ఏ పార్టీలో చేరేది చెబుతా. మల్కాజ్ గిరి ప్రజలకు, నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. దేనికీ లొంగేది లేదు. ప్రజల కోసమే పని చేస్తాను’’ అని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో తనతోపాటు తన కుమారుడికి కూడా టికెట్ ఆశించారు మైనంపల్లి. అయితే.. ఒకరికే టికెట్ వస్తుందన్న లీకులతో జాబితా ప్రకటించక ముందే తిరుమల వెంకన్న సాక్షిగా మంత్రి హరీశ్ రావు (Harish Rao) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటికే లిస్ట్ రెడీ కావటంతో కేసీఆర్ (KCR) ఎలాంటి మార్పులు చేయకుండానే విడుదల చేశారు. మైనంపల్లికి టికెట్ ఇచ్చి ఆయన కుమారుడికి ఇవ్వలేదు. దీంతో మరోసారి హరీశ్ ను టార్గెట్ చేశారు మైనంపల్లి. మెదక్ లో తన కుమారుడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయిస్తున్నాడని చెప్పుకొచ్చారు. అయినా, టికెట్ ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మైనంపల్లి వ్యాఖ్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడడం.. ఆ తర్వాత మిగిలిన నేతలు అదే పాట పాడడంతో హన్మంతరావు పార్టీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం ఎక్కువైంది.
ఇన్నాళ్లూ మైనంపల్లి నిర్ణయంపై అందరూ ఆసక్తిగా చూస్తుండగా.. ఎట్టకేలకు ఆయన ఓపెన్ అయ్యారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీకి పంపించేశారు. అయితే.. ఏ పార్టీలో చేరే అంశాన్ని సస్పెన్స్ లో పెట్టారు. మైనంపల్లితో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటిదాకా పలు దఫాలుగా ఆయనతో సంప్రదింపులు జరిపారు ఇరు పార్టీల నేతలు. దీంతో మైనంపల్లి దారి ఎటువైపు ఉంటుందనే ఉత్కంఠ ఉంది. ఈ సస్పెన్స్ ను మరికొంత కాలం పొడిగించారు ఆయన. అయితే.. కాంగ్రెస్ లోకే ఆయన జంప్ అవుతారని ఎక్కువగా వినిపిస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో మైనంపల్లికి మంచి రిలేషన్ ఉంది. గతంలో వీళ్లిద్దరూ టీడీపీ (TDP) లో కలిసి పని చేశారు. 2009 ఎన్నికల్లో ఆపార్టీ నుంచి గెలిచారు. ఇప్పుడు మైనంపల్లి కాంగ్రెస్ వైపే చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే డీకే శివకుమార్ (DK Sivakumar) ను కలిసేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయని వార్తలు వచ్చాయి. ఇంత జరిగాక మళ్లీ సస్పెన్స్ అవసరమా మైనంపల్లి అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.