బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కి రాజీనామా చేసిన మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanumatha Rao) తాను కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తాను బీఆర్ఎస్ కి రాజీనామా చేసిన వెంటనే పార్టీలోకి ఆహ్వానించారని మైనంపల్లి మీడియాతో చెప్పారు. ఇప్పుడు తానెంటో బీఆర్ఎస్ కు చూపిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.
సెప్టెంబర్ 27వ తేదీ వరకు ముహూర్తాలు బాగున్నాయని.. ఆలోపు ఢిల్లీ వెళ్లి కాంగ్రెసులో చేరుతానని వెల్లడించారు. తనకు మద్దతు తెలిపిన నాయకులపై బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, అక్రమంగా కేసులు పెట్టి టార్చర్ చేస్తున్నదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు…మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడు రోహిత్ కు మెదక్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ టికెట్లు ప్రకటించే రోజు తిరుపతిలో ఉన్న మైనంపల్లి.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ రెండు టికెట్లు ఇవ్వకపోతే పార్టీని వీడతానని హెచ్చరికలు కూడా పంపారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం అవేవీ పట్టించుకోకుండా.. సిట్టింగుల కోటాలో కేవలం మైనంపల్లి హన్మంతరావుకు మాత్రమే టికెట్ ఇచ్చింది. ఆ రోజు నుంచి అసమ్మతి రాగం వినిపించిన మైనంపల్లి.. తాజాగా కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంలో మైనంపల్లి తనకు మూడు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌ను రెండు టికెట్లు కోరిన మైనంపల్లి…కాంగ్రెస్‌ను ఏకంగా మూడు టికెట్లు కావాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తనకు మేడ్చల్ టికెట్, కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్‌తో పాటు మల్కాజిగిరి టికెట్‌ను తన అనుచరుడు నక్కా ప్రభాకర్ గౌడ్‌కు ఇవ్వాలని కోరారు. నక్కా ప్రభాకర్ గౌడ్ కు టిక్కెట్ ఇస్తే తప్పకుండా గెలిపించుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో చెప్పినట్లు సమాచారం.
ఏ నియోజకవర్గంలోనైనా సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని…ముందస్తుగా ఎవరికీ హామీ ఇవ్వడం లేదని మైనంపల్లికి కాంగ్రెస్ పెద్దలు తేల్చిచెప్పినట్లు సమాచారం. కాగా మైనంపల్లి ప్రస్తుతం ఢిల్లీ ప్రయాణం అవుతున్నారు. అక్కడే అధిష్టానంతో టిక్కెట్ల విషయాన్ని చర్చిస్తారని తెలుస్తున్నది. ఇప్పటికే కుటుంబంలో రెండు టికెట్ల విషయంలో కాంగ్రెస్ కఠినంగా ఉన్నది. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీలో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే కుటుంబంలో రెండు టికెట్ల విషయం పరిశీలిస్తామని చెప్పింది. మరి ఇప్పుడే చేరుతున్న మైనంపల్లి విషయంలో ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే.