కరోనా (Corona) సృష్టించిన విధ్వంసం నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో చైనా (China)లో మరో ఆందోళనకర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజాగా డ్రాగన్ కంట్రీలో మరో మహమ్మారి వెలుగు చూడటంతో ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. చైనా పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఇన్ ఫ్లూ యెంజా (influenza)లాంటి వ్యాధి భారిన పడుతున్నారు.
బీజింగ్, లియోనింగ్ నగరాల్లో ఆస్పత్రులు బాధిత చిన్నారులతో నిండిపోతున్నాయి. విద్యార్థుల్లో శ్వాసకోస లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పాఠశాలలను మూసివేసే పరిస్థితి నెలకొందని చర్చ జరుగుతోంది. ఇది ఇలా వుంటే ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించాలని చైనాను డబ్ల్యూహెచ్ఓ కోరుతోంది.
జాతీయ ఆరోగ్య కమిషన్‌కు చెందిన చైనా అధికారులు ఈ నెల 12న మీడియా సమావేశం నిర్వహించి… దేశంలో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయని చెప్పారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. కొవిడ్-19 నియంత్రణలను ఎత్తివేయడమే అందుకు కారణమని అధికారులు చెప్పారని తెలిపింది. ఇన్‌ఫ్లుయెంజా, సార్స్-కోవ్-2 (కొవిడ్-19కి దారితీసే వైరస్), శిశువులను ప్రభావితం చేసే ఆర్ఎస్‌వీ, మైకోప్లాస్మా న్యుమోనియా, అలాగే రద్దీ స్థాయి వంటి ఇతర విషయాల గురించి సమాచారాన్ని అందించాలని కోరినట్టు పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా మనుషులు, జంతువుల్లో వ్యాపించే వ్యాధులను ప్రొమేడ్ అనే సంస్థ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటుంది. తాజాగా చైనాలో ప్రబలుతున్న న్యూమోనియా వ్యాధి గురించి ఆ సంస్థనే వెల్లడించింది. గతంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పుడు ఈ సంస్థనే హెచ్చరించింది. తాజాగా న్యూమోనియా లాంటి వ్యాధి ఎప్పుడు మొదలైందనే విషయంపై ఖచ్చితమైన సమచారం లేదని వివరించింది.