ప్రజా సేవ కోసం పుట్టిన రాజకీయాలు.. పదవులు అనుభవించడానికి, ధనం సంపాదించడానికి మాత్రమే పనికి వస్తున్నాయని లోకం అనుకుంటుంది. ఇప్పుడున్న రాజకీయ పోటీ అంతా స్వార్థం, ఆధిపత్యం చుట్టే తిరుగుతుండటం సమాజానికి ఆందోళనకర విషయమని అనుకుంటున్నారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. నేతల మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరుకుంది. అందులో ప్రతి నియోజక వర్గం ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ (Nalgonda) జిల్లా.. ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాకు చెందిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో (two assembly constituencies) జరుగుతున్న ఎన్నికల ఫైట్ ఆసక్తికరంగా మారి అందరిని ఆకర్షిస్తోంది.
ఎందుకంటే.. ఏళ్లకు ఏళ్లు గడిచినా ప్రత్యర్థులుగా ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ రెండు నియోజకవర్గాల్లో తలపడటమే కారణం. గతంలో ఇక్కడ తండ్రుల మధ్య ఎన్నికల వార్ జరిగితే.. ఇప్పుడు వారి వారసులైన కొడుకుల మధ్య వార్ ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం జానారెడ్డి అడ్డా.. ఎమ్మెల్యేగా జానారెడ్డి ఇక్కడ 1983 నుంచి 2014 వరకు ఏడుసార్లు గెలిచారు. అంతేకాకుండా తెలుగుదేశం.. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా కొనసాగారు.
మరోవైపు జానారెడ్డి 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) తరఫున.. నోముల నర్సయ్య బీఆర్ఎస్ (BRS) తరఫున తలపడ్డారు. 2014లో నోములపై జానారెడ్డి గెలిస్తే.. 2018లో జానారెడ్డిపై నోముల విజయం సాధించారు. అనంతరం నోముల హఠాన్మరణంతో జరిగిన ఉప పోరులోనే జానారెడ్డిపై నోముల తనయుడు భరత్ పోటీ చేసి విజయం సాధించారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భరత్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే.. కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి కుమారుడు జైవీర్ తొలిసారి పోటీ చేస్తున్నారు.
మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలాంటి సీనే నడుస్తోంది. ఒకప్పడు బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతాన్ని 2009లో గులాబీ పార్టీ ముట్టడించి.. స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుసార్లు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విజయాన్ని సాధించారు. అనంతరం 2010 ఉప ఎన్నికల్లోనూ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరఫున విద్యాసాగర్ రావు.. కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి జువ్వాది రత్నాకర్ రావులు పోటాపోటీగా తలపడ్డారు.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విద్యాసాగర్ రావును జువ్వాది తనయుడు నర్సింగరావు ఢీ కొన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ సంజయ్ .. జువ్వాది నర్సింగరావు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.. ఇలా తండ్రుల మధ్య మొదలైన ఎన్నికల పోరు ఇప్పుడు కొడుకుల మధ్య కూడా కంటిన్యూ కావటం ఆసక్తికరంగా మారింది.