నాగర్ కర్నూల్ జిల్లా, నల్లమల్ల అడవి (Nallamala Forests) ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం (Massive Fire) చోటు చేసుకొంది.. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో మల్లెలతీర్థం (Mallelatirtha), తాటిగుండాల (Tatigundala) అడవి దగ్ధం అవుతుంది. కాగా స్థానికుల ద్వారా ప్రమాద సమాచారం అందుకొన్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొన్నారు.
ఫైరింజన్ల సహయంతో అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో ఓ ఫైర్ వాచర్‌కు గాయాలు అయ్యాయని సమాచారం.. అతన్ని వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు నల్లమల అడవిలో మంటలు ఎగసిపడుతుండటంతో సమీప ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు.
ఇక ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు జనవరి నెలలో సైతం నల్లమల అడవిలో భారీ అగ్ని ప్రమాదంచోటు చేసుకొంది. దోమలపెంట, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం దగ్ధమైనట్లు ఆ సమయంలో వెల్లడించారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో అడవుల్లో నిప్పు రాజుకునే అవకాశాలుంటాయి. అదీగాక తెలియని వ్యక్తులు నిప్పంటించినా.. ప్రమాదవశాత్తూ జరిగినా.. వెంటనే మంటలు వ్యాపిస్తాయి.
సమయానికి అందుబాటులో నీరు లేకపోవడం వల్ల మంటలు త్వరగా అడవులను దహించి వేస్తాయి. ఈ క్రమంలో అందులోని అనేక జీవరాసులు మరణిస్తుంటాయి. ఇక నల్లమల్ల అడవి ప్రాంతంలో మంటలు రావడం ఇది మొదటి సారి కాదు. కాబట్టి అగ్నిప్రమాదాల నుంచి వీటిని రక్షించేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందని అంటున్నారు.