Telugu News » Nanded : 48 గంటల్లో 31 మంది మృతి… నాందేడ్ లో కొనసాగుతున్న మరణ మృదంగం…!

Nanded : 48 గంటల్లో 31 మంది మృతి… నాందేడ్ లో కొనసాగుతున్న మరణ మృదంగం…!

దీంతో గడిచిన 48 గంటల్లో మరణాల సంఖ్య 31కి చేరింది.

by Ramu

మహారాష్ట్ర (Maharastra) లోని నాందేండ్ (Nanded) ప్రభుత్వాస్పత్రిలో వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో ఏడుగురు రోగులు మృతి చెందారు. దీంతో గడిచిన 48 గంటల్లో మరణాల సంఖ్య 31కి చేరింది. అందులో 16 మంది చిన్నారులు వున్నట్టు అధికారులు తెలిపారు. ఔషదాల కొరత వల్లే రోగులు మృతి చెందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

 

నాందేడ్ ప్రభుత్వాస్పత్రిలో నిన్న ఒక్క రోజే 24 మంది మరణించారు. అందులో 12 మంది నవజాత శిశువులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. సౌకర్యలేమి, సిబ్బంది కొరత, ఔషదాలు అందుబాటులో లేక పోవడం వల్లే రోగులు మరణిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకు పడుతున్నాయి.

ఇది ఇలా వుంటే ఈ రోజు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సమావేశంలో నాందేడ్ ప్రభుత్వాస్పత్రిలో మరణాలపై చర్చించనున్నట్టు పేర్కొన్నాయి. ఈ మరణాలపై దర్యాప్తు జరిపేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు పేర్కొన్నాయి. నాందేడ్ ఆస్పత్రిలో మరణాలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ట్వీట్ చేశారు.

నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస మరణాలపై శరద్ పవార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సందేహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఏడాది అగస్టులో థానే ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా ఇలాంటి ఘటన జరిగిందన్నారు.

ఆ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయాని తెలిపారు. నాందేడ్ ఘటపై దర్యాప్తు జరిపించి ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నాందేడ్ ప్రభుత్వాస్పత్రిని మహారాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి, ఎమ్మెల్యే అశోక్ చవాన్ సందర్శించారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని చవాన్ వెల్లడించారు.

You may also like

Leave a Comment