రాష్ట్రాన్ని వైసీపీ (YCP) ప్రభుత్వం అప్పుల మయం చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. రెండు నెలలు ఓపిక పడితే టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని తెలిపారు. ఉత్తరాంధ్రను టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో అభివృద్ధి బాటలో నడిపించారని చెప్పారు.
కానీ వైసీపీ వచ్చిన ఐదేండ్లలో గంజాయి సరఫరాకు కేంద్రంగా మార్చిందని ఫైర్ అయ్యారు. నర్సీపట్నంలో జరిగిన టీడీపీ శంఖారావంలో నారా లోకశ్ మాట్లాడుతూ… నర్సీపట్నం టీడీపీకి కంచుకోట అన్నారు. జగన్ పాలనలో విశాఖలో రోజుకో కిడ్నాప్, విధ్వంసం, హత్య, భూకుంభకోణం జరుగుతున్నాయంటూ నిప్పులు చెరిగారు.
చంద్రబాబు హయాంలో విశాఖను ఉపాధికి రాజధానిగా మారిస్తే, జగన్ వచ్చాక గంజాయికి దేశ రాజధానిగా మార్చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరం నియోజకవర్గంలో వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న కే.కే..రాజు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ, గంజాయి విచ్చలవిడిగా అందేలా చేస్తున్నాడని తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ నాయకులను, కార్యకర్తలను బెదిరించి పలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు.
టీడీపీ అధికారంలోకి రాగానే ఇటువంటి వారికి బుద్ధి చెబుతామన్నారు. ఉత్తరాంధ్రను మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కలిసి మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అయ్యన్నపాత్రుడిపై ఎన్నో కేసులు పెట్టారని గుర్తు చేశారు. కానీ ఒక్క కేసును కూడా నిరూపించలేకపోయారన్నారు. సీఎం జగన్ సిద్ధం సభలో మతి భ్రమించి మాట్లాడారని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు నవ రత్నాలు ఇస్తామని చెప్పి.. బూతు పనులు చేసే వారికి రత్నాలు ఇస్తున్నారని విరుచుకుపడ్డారు.