వైసీపీ (YCP) సర్కార్ పై విరుచుకుపడ్డారు టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Lokesh). భద్రత లేని జైలులో చంద్రబాబు (Chnadrababu) ఆరోగ్యం క్షీణించేలా చేసి.. ఆయనకి ప్రాణహాని తలపెడుతున్నారన్నారు. ఎన్నడూ ఏ తప్పూ చేయని 73 ఏళ్ల చంద్రబాబు పట్ల రాక్షసంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అనారోగ్య కారణాలతో ఆయన్ను అంతమొందించే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు.
ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న లోకేశ్.. గన్నవరం నుంచి రోడ్డు మార్గాన రాజమహేంద్రవరానికి వెళ్లారు. టీడీపీ క్యాంపు కార్యాలయంలో కాసాని జ్ఞానేశ్వర్, బుచ్చయ్య, చినరాజప్ప, జవహర్ తో సమావేశమయ్యారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబును రిమాండ్ లోనే ఉంచాలనే కుట్ర జరుగుతోందన్నారు లోకేశ్. చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉందని చెప్పారు.
చంద్రబాబుకి ఏ హాని జరిగినా, సైకో జగన్ సర్కార్, జైలు అధికారులదే బాధ్యత అని తెలిపారు లోకేశ్. చంద్రబాబు జీవితం ప్రమాదంలో ఉందన్న ఆయన.. ఆయన ఆరోగ్యంపై ఎందుకీ కక్ష? అని ప్రశ్నించారు. దోమలు ఎక్కువ ఉన్నాయన్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. చన్నీళ్లు ఇస్తున్నారన్నా లెక్క చేయలేదని.. సరిగ్గా తిరగని ఫ్యాన్ పెట్టారని ఆరోపణలు చేశారు.
చంద్రబాబు బాగా బరువు తగ్గిపోయారని.. అలెర్జీ వచ్చి, డీహైడ్రేషన్ తో బాధపడుతున్నారని వివరించారు. జైలు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని తెలిపారు. జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుని ముద్దాయి అని హెల్త్ బులెటిన్ లో పదే పదే పేర్కొనేందుకు పెట్టిన శ్రద్ధ ఆయన ఆరోగ్యం, భద్రతపై పెట్టడం లేదని ఆరోపించారు లోకేశ్.