ఢిల్లీ(Delhi)లోని రాష్ట్రపతి భవన్ వేదికగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఇవాళ(మంగళవారం) ఘనంగా జరిగింది. వివిధ క్రీడల్లోని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్లేయర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు. టీమిండియా(Team India) స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Momammed Shami) అర్జున అవార్డును అందుకున్నాడు. మరికొందరు క్రీడాకారులు ఈ అవార్డులను అందుకున్నారు.
2023 వన్డే ప్రపంచకప్‌లో షమి అసాధారణ ప్రదర్శన కనబరిచి ఏడు మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. షమీతో పాటు చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్.వైశాలీ, పిస్టల్ షూటింగ్ సెన్సేషన్ ఈషా సింగ్, రెజ్లర్ అంతిమ్ పంఘాల్, బాక్సర్ మహమ్ముద్ హుస్సాముద్దీన్, పారా ఆర్చర్ సీతల్ దేవీ అర్జున అవార్డు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా చెస్ క్రీడాకారుడు ప్రజ్ఞానందా కోచ్ ఆర్బీ రమేశ్ ద్రోణాచార్య పురస్కారాన్ని అందుకున్నారు.
మొత్తం 26 మంది అర్జున అవార్డులను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈషా సింగ్ (షూటింగ్), మహ్మద్ హుసాముద్దీన్ (బాక్సింగ్), అజయ్‌కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్)లకు ఈ అవార్డులు దక్కాయి. కాగా, ఖేల్ రత్న అవార్డు గ్రహీతలు సాత్విక్ సాయి రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి ఈ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం మలేషియా ఓపెన్ సూపర్ 1000లో ఆడుతున్నందున వాళ్లు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు.
అవార్డు గ్రహీతలకు ధ్యాన చంద్ ఖేల్ రత్న అవార్డుకు రూ. 25 లక్షలు, అర్జున, ద్రోణాచార్య పురస్కారానికి గానూ రూ. 15 లక్షల నగదు పురస్కారం అందుకుంటారు. సాధారణంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి అయిన ఆగస్టు 29న జరగాల్సింది. అయితే గతేడాది హాంగ్జెలో సెప్టెంబర్ 23నుంచి అక్టోబర్ 8వరకు ఆసియా క్రీడలు జరగటం వల్ల
ఈ వేడుకను వాయిదా వేశారు.
VIDEO | Cricketer @MdShami11 receives Arjuna Award from President Droupadi Murmu at Rashtrapati Bhavan, Delhi.@rashtrapatibhvn pic.twitter.com/agDi8Vy7CD
— Press Trust of India (@PTI_News) January 9, 2024