నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అంటూ తన రచనలతో తెలంగాణ (Telangana) అస్థిత్వపు భావజాలాన్ని నలుదిశలా చాటారు సాహితీ యోధుడు, మహాకవి దాశరథి కృష్ణమాచార్య. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం.. ఈ నేలపై నినదించిన గొంతులెన్నో.. తెగిపడిన తలలు మరెన్నో. అలాంటి త్యాగాల తెలంగాణ.. నేడు తాగుబోతుల తెలంగాణగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ (KCR) పాలనలో మద్యం ఏరులై పారుతోందని ప్రతిపక్ష నేతలు తరచూ తిడుతుంటారు. విచ్చలవిడిగా మద్యం షాపులు ఓపెన్ చేయించి జనాన్ని తాగుబోతులుగా మారుస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈక్రమంలోనే నేరాలు అధికంగా జరుగుతున్నాయని.. బాలాజీ నగర్ ఘటనే అందుకు నిదర్శనమని చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
మద్యం మత్తులో ఓ యువకుడు బరితెగించాడు. నడిరోడ్డుపై ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వివస్త్రను చేశాడు. హైదరాబాద్ బాలాజీ నగర్ (Balaji Nagar) లో ఈ ఘటన జరిగింది. యువతి షాపింగ్ కి వెళ్లి రిటన్ వస్తుండగా.. కాపుకాసిన పెద్ద మారయ్య అనే కీచకుడు ఆమెను లైంగికంగా వేధించాడు. దాడి చేసి ఒంటిపై ఉన్న బట్టలను చింపేశాడు. బాధిత యువతి ఎంత వేడుకున్నా తప్పతాగి ఉండడంతో వినిపించుకోలేదు. దాదాపు 15 నిమిషాలపాటు ఆమెను నగ్నంగా నడిరోడ్డుపై నిలబెట్టాడు. కాసేపటికి స్థానికులు యువతిని రక్షించారు. పక్కనే ఉన్న ఫ్లెక్సీ కవర్లను ఆమెకు చుట్టి కాపాడారు.
కేసు నమోదు
ఈ ఘటన గురించి ఫోన్ లో బాధితురాలు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. వారు దుస్తులు తీసుకొచ్చారు. బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. నిందితుడు పెద్ద మారయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మహిళల పట్ల జరిగే అన్యాయాలు రోజు రోజుకి పెరుగిపోతున్నాయని.. తమకు భద్రతను కల్పించాలని కోరుతున్నారు.
మహిళా కమిషన్ సీరియస్
యువతి వివస్త్ర ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. వారం రోజుల్లో ఈ విషయమై నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ను ఆదేశించింది. యువతికి న్యాయం చేయాలని తెలిపింది. బాధితురాలికి వైద్య సహాయం అందించాలని సూచించింది. అయితే.. తన తల్లిని దూషించడం వల్లే తాను అలా చేశానని నిందితుడు చెబుతున్నట్టు పోలీసులు తెలిపారు. కానీ, ఎంత దూషించినా.. యువతిని నడిరోడ్డుపై వివస్త్రను చేసే ధైర్యం ఎవరిచ్చారు? అంటూ మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.