బీఆర్ఎస్లోకి (BRS) మాజీ బీఎస్పీ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ (Rs Praveen kumar) రాకతో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్కు కొత్త చిక్కులు (New Problems)మొదలయ్యానని తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటమికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారణమని గులాబీ కేడర్, కీలకనేతలు ఆరోపిస్తున్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో దళితుల ఓట్లను (Dalith Votes) బీఆర్ఎస్కు దూరం చేశారని కేడర్ పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నది. దీనికి తోడు ఆర్ఎస్పీ పార్టీలో చేరడంతో ఆయనతో పాటు బీఎస్పీలో పనిచేసిన 85 మంది పలు నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలు, 40 మంది వరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జులు, రాష్ట్రంలో కీలక బాధ్యతల్లో పనిచేసిన వారు సైతం గులాబీ కండువా కప్పుకున్నారు.
వీరి రాకతో ప్రస్తుతం బీఆర్ఎస్లో ముందు నుంచి పనిచేస్తున్న వారిలో అసమ్మతి రాగాలు వినిపించే అవకాశం లేకపోలేదు. బీఆర్ఎస్లో ఆది నుంచి ఉన్న ఉద్యమకారులనే కేసీఆర్ పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి పార్టీలో ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారని చర్చ జరుగుతోందని టాక్ వినిపిస్తోంది.
గులాబీ పార్టీకి గ్రామస్థాయిలో కమిటీలు ఉన్నాయి. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారికి గుర్తింపు లభించడం లేదని, పార్టీ పదవుల్లోనూ అవకాశం కల్పించడం లేదని కొందరు నేతలు గుర్రుగా ఉన్నారని తెలిసింది. గ్రామస్థాయిలో అన్ని కమిటీలు వేస్తామని కేసీఆర్ ప్రకటించి ఏడాది గడుస్తోంది. అయినా ఇంతవరకు వేయలేదు. ఇటీవల ఆర్ఎస్పీ చేరిక సందర్భంగా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామని ప్రకటించారు.కానీ మళ్లీ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కమిటీలు వేస్తే మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారా? కొత్తగా వచ్చిన వారికి ఇస్తారా? అని ప్రశ్న వారిలో నెలకొంది.
కేసీఆర్ను నమ్మి వచ్చిన ఆర్ఎస్పీ, అతని వెంట వచ్చిన వారికి కేసీఆర్ ఎలా న్యాయం చేస్తారనేది ఇక్కడ మిలియన్ డాలర్ ప్రశ్న? పార్టీలో చేరేవరకు కేసీఆర్ ప్రయారిటీ ఇస్తారని.. వచ్చాక పట్టించుకోరని మరికొందరు బహాటంగానే కామెంట్స్ చేస్తున్నారు.దీనంతటినీ కేసీఆర్ ఎలా మెనేజ్ చేస్తారో వేచిచూడాల్సిందే.