cNews Click : వెబ్ పోర్టల్ న్యూస్ క్లిక్ కి చైనా నుంచి అందుతున్న నిధులపై న్యూయార్క్ టైమ్స్ (Newyork Times) ప్రచురించిన వార్త సంచలనం రేపింది. ఇది కేవలం సముద్రంలో ఓ నీటి చుక్కవంటిదేనని బీజేపీ రాజ్యసభ ఎంపీ, సీనియర్ అడ్వొకేట్ మహేష్ జెఠ్మలానీ వ్యాఖ్యానించారు. ఈ పోర్టల్ చైనా నుంచి రూ.. 38 కోట్ల నిధులను అందుకున్నదని, భారత వ్యతిరేక ప్రచారానికి ఈ నిధులను ఉద్దేశించారని నిన్న బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్ సభలో పేర్కొనగానే దీనిపై దుమారం రేగింది. న్యూస్ క్లిక్ అన్నది ‘టుక్డే టుక్డే గ్యాంగ్’ లో భాగమని, ఈ నిదులద్వారా ఎవరికి ప్రయోజనం కలిగిందో ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, చైనా, ఈ పోర్టల్ ఒకే జాతికి చెందినవని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఆరోపించారు. నెవిల్లే రాయ్ సింగం, ఆయనకు చెందిన న్యూస్ క్లిక్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు చెందిన ప్రమాదకరమైన సాధనాలని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నదన్నారు. ఇప్పుడు తాజాగా మహేష్ జెఠ్మలానీ కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని, జైరాంరమేష్ ని టార్గెట్ చేశారు.
2001-2008 మధ్య గానీ, ఆ తరువాత గానీ నెవిల్లే రాయ్ సింగం హ్యూవీ టెక్నికల్ ఆఫీసరుగా ఉండగా మీరు ఆయనను కలిశారా లేదా అని ఆయన ప్రశ్నించారు. 2006 లో ‘చిండియా’ పేరిట జైరాంరమేష్ ఓ పుస్తకాన్ని ప్రచురించారని, అందులో హ్యూవి గురించి ప్రస్తావించారని మహేష్ జెఠ్మలానీ గుర్తు చేశారు. ఈ సంస్థతో మీ ప్రయోజనాలు మీరు యూపీఏ-2 హయాంలో పర్యావరణ శాఖ మంత్రిగా ఉండేంతవరకు కొనసాగాయన్నారు. 2008 లో సోనియా గాంధీ సమక్షంలో రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఓ ఎంఓయుపై సంతకాలు చేశారన్నారు. హ్యూవీతో నెవిల్లే కి సంబంధాలున్న కాలంలోనే ఇదంతా జరిగిందన్నారు. మీరు ఒక్కరు గానీ, మీ ఇద్దరు గానీ నాడు నెవిల్లేని కలిశారా లేదా అని ప్రశ్నించిన ఆయన.. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ.. ఎన్ఐఏ చేత దర్యాప్తు జరిపించవలసి ఉందన్నారు.
చైనీస్ టెలికాం సంస్థ అయిన హ్యూవీకి నెవిల్లే రాయ్ సింగం 2001-2008 మధ్య కాలంలో చీఫ్ టెక్నికల్ ఆఫీసరుగా వ్యవహరించారు. ప్రపంచ వ్యాప్తంగా చైనా తరఫున ప్రచారం చేస్తున్న వ్యక్తిగా ఇతడిని న్యూయార్క్ టైమ్స్ తన పత్రికలో పేర్కొంది. పలు న్యూస్ సైట్స్ లో న్యూస్ క్లిక్ కూడా ఓ సైట్ అని, ఈ వ్యవహారమంతా మంగళవారం పార్లమెంటును కుదిపివేసిందని వార్తలు వచ్చాయి.