నిషేధిత పాపులర్ ఆఫ్ ఇండియా(PFI)పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో సంబంధాలున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు ఉండడం కలకలం రేపుతోంది.
ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్లాన్ చేస్తుండటంతో గతేడాది సెప్టెంబర్‌లో ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 100కుపైగా ప్రదేశాల్లో ఎన్‌ఐఏ, ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాను ఎన్ఐఏ విడుదల చేసింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకుల పేర్లు ఉండడం చర్చనీయాంశమైంది.
ఎన్ఐఏ విడుదల చేసిన లిస్టులో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపూర్‌కు చెందిన అబ్దుల్ సలీ, నిజామాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్ ఉన్నారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ అహ్మద్ కూడా ఉన్నాడు.
ఈ యువకులకు సంబంధించిన సమాచారం తెలిస్తే.. 9497715294 అనే వాట్సాప్ నంబర్‌కు కాల్ చేయవచ్చని ఎన్ఐఏ కోరింది. సమాచారం అందించినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. ఈ ముగ్గురితోపాటు కేరళలో 11 మంది, కర్ణాటకలో ఐదుగురు, తమిళనాడులో ఐదుగురిని మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చింది.