ఉగ్ర కార్యకలపాలు కొనసాగిస్తోందని కొన్నాళ్ల క్రితం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) ను కేంద్రం నిషేధించింది. కానీ, ఇంకా సైలెంట్ గా పీఎఫ్ఐ కార్యకలాపాలు కొనసాగిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ (NIA) తరచూ తనిఖీలు చేస్తోంది. తాజాగా కరీంనగర్ (Karimnagar), ఆదిలాబాద్ (Adilabad) జిల్లాల్లో సోదాలు నిర్వహిస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ అధికారులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలకు వెళ్లారు.
పీఎఫ్ఐ కదలికల నేపథ్యంలో కరీంనగర్ హుస్సేన్ పురలో సోదాలు చేస్తోంది ఎన్ఐఏ. తఫ్రీజ్ ఖాన్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేపట్టింది. ఇతనికి పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. తఫ్రీజ్ ఖాన్ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి సారించింది.
గతంలో కూడా పీఎఫ్ఐ కదలికలపై అనుమానాలతో అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో మొదటగా నిజామాబాద్ లో పీఎఫ్ఐ కదలికలను స్థానిక పోలీసులు గుర్తించారు. వ్యాయామ శిక్షణ నిర్వహిస్తున్న ట్రైనర్ ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహించగా.. పీఎఫ్ఐ లింకులు వెలుగు చూశాయి.
గతేడాది సెప్టెంబర్ లో పీఎఫ్ఐపై నిషేధం విధించింది కేంద్రం. ఈ సంస్థ సభ్యులకు ఉగ్రవాద ముఠాలతో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద చర్యలు తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని.. ఐదేళ్ల పాటు నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలను సైతం నిషేధిత జాబితాలో చేర్చింది మోడీ సర్కార్.