కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury)పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫైర్ అయ్యారు. బీజేపీయేతర రాష్ట్రాలకు రావాల్సిన బకాయిలు, పన్నుల చెల్లింపు విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు.
ఆ ఆరోపణలను స్వార్థ ప్రయోజనాలతో చేసిన రాజకీయ విష ప్రచారాలుగా ఆమె పేర్కొన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగానే రాష్ట్రాలకు నిధుల పంపిణీ జరుగుతుందని ఆమె ఉద్ఘాటించారు. ఆ సిఫారసులను ఎలాంటి పక్షపాతం లేదా రాజకీయ ప్రభావం లేకుండా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రానికో రకంగా తన ఇష్టానుసారంగా నిబంధనలను మార్చే హక్కు తనకు లేదని వెల్లడించారు. ఇది తమ పార్టీ రాజకీయాలకూ విరుద్ధమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తనకు నిబంధనలను మార్చే బాధ్యత ఉండదని చెప్పారు. తాము నిబంధనలను నూరు శాతం అనుసరించాల్సిందేనని తేల్చి చెప్పారు.
ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను తాను అమలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఆర్థిక మంత్రిగా, వ్యక్తిగత ప్రాధాన్యతలు లేదా పార్టీ రాజకీయాల ఆధారంగా కేటాయింపులను మార్చే అధికారం తనకు లేదన్నారు. ఈ ప్రక్రియ ఇలా సాగుతుంటే కొన్ని రాష్ట్రాలు రాజకీయ రంగు పులుముతూ ఆయా రాష్ట్రాల పట్ల వివక్ష కనబరుస్తున్నామని ఆరోపణలు గుప్పిస్తున్నాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.