Nitish Kumar : 2024 ఎన్నికల తరువాత బీహార్ ( Bihar) నుంచి బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) జోస్యం చెప్పారు. విపక్షాలన్నీ కలిసి ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేసిన తరువాత బీజేపీలో భయం మొదలైందని, ప్రతిపక్షాల సమైక్యత చూసి ఆందోళన చెందుతోందని ఆయన చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి ఖాయమని చెప్పారు. ఈ దేశ ప్రయోజనాలకోసం మేమంతా చేతులు కలిపాం.. ఇంకా అనేక పార్టీలు కూడా మాతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడగానే ఆ పార్టీలన్నీ మాతో కలుస్తాయి’ అన్నారు.
ప్రధాని మోడీ (Modi) ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నితీష్ నేతృత్వంలోని జేడీ యు సమర్థించింది. మణిపూర్ ఇష్యూను హైలైట్ చేయడం ద్వారా విపక్షాలు తమ పనిని తాము చేశాయని ఆయన చెప్పారు. ఈ తీర్మానానికి సంబంధించి పార్లమెంట్ లో మొదటి రెండు రోజుల్లో మోడీ ఎందుకు లేరని ఆయన ప్రశ్నించారు.
సభ జరుగుతుండగా ఎంపీలు అటూఇటూ తిరుగుతూ బిజీగా కనిపించారని, నాడు అటల్ బిహారీ వాజ్ పేయి అధికారంలో ఉండగా ఆయన మంత్రివర్గంలో తానూ ఉన్నానని చెప్పిన నితీష్.. సభలోనే ఎంపీలు ఉండాలని తాము ప్రధానంగా ప్రస్తావించేవారిమని పేర్కొన్నారు.
ప్రజలను మీరు వాకబు చేస్తే కమలం పార్టీ కేవలం ప్రచారాలు, పబ్లిసిటీపైనే దృష్టి పెడతాయని వారు ఆరోపిస్తారని ఆయన అన్నారు. బీహార్ లోని సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి విరుచుకుపడిన నేపథ్యంలో నితీష్ ..ఇలా కమలనాథులను దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను ప్రభుత్వం అదుపు చేయలేకపోయిందని సామ్రాట్ చౌదరి చేసిన ఆరోపణను ఆయన కొట్టిపారేశారు.