మిత్ర పక్షం జనతాదళ్ యునైటెడ్ (JDU)చీఫ్, సీఎం నితీశ్ కుమార్‌ను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పడింది. ఇప్పటికే నితీశ్ కుమార్ తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ లో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన అలక పాన్పు దిగలేదని తెలుస్తోంది. దీంతో ఆయన్ని ఎలాగైనా బుజ్జ గించాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆ ప్రయత్నాల్లో భాగంగానే నితీశ్ కుమార్‌ను ఇండియా కూటమికి కన్వీనర్‌గా ప్రకటించాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. తాజాగా జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వర్చువల్ గా సమావేశం అయ్యారు. రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుతో పాటు పలు అంశాలపై ముగ్గురు నేతలు చర్చించినట్టు జేడీయూ వర్గాలు చెప్పాయి.
మరోవైపు ఇండియా కూటమి కన్వీనర్‌గా నితీశ్ కుమార్ ను నియమిస్తారని, కూటమి చైర్మన్ గా ఖర్గేను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తమకు సమాచారం ఉందని పేర్కొన్నాయి. ఓ వైపు లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోవైపు నితీశ్ కుమార్ ఇండియా కూటమి తీరు పట్ల కాస్త అసంతృప్తిగా ఉన్నారని, ఆయన మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ఆలోచనలు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇక రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో మిత్ర పక్షంలో విభేదాలు కూటమికి నష్టం కలిగించే అవకాశం ఉందని కాంగ్రెస్ భయపడుతోందని సమాచారం. మరో వైపు కూటమిలో లుకలుకలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకు వెళ్తాయని కాంగ్రెస్ భావిస్తోందని తెలుస్తోంది. అందుకే నితీశ్ కు ఏదో ఓ పదవి ఇచ్చి ఆయన్ని బుజ్జగించాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇప్పటికే ఈ విషయంలో మిత్ర పక్షాలను ఒప్పించే పనిలో కాంగ్రెస్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కూటమి కన్వీనర్ గా నితీశ్ కుమార్ ను నియమించే విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని సీఎం కేజ్రీవాల్ చెప్పినట్టు తెలుస్తోంది. అటు శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే వారం జరిగే కూటమి సమావేశాల్లో నితీశ్ నియామకం గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది.