బిహార్ (Bihar)లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. మరి కొన్ని గంటల్లో మహా ఘట బంధన్ కూటమి కూలి పోతుందని తెలస్తోంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఈ రోజు తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నితీశ్ కుమార్ వెంట వెళ్లేందుకు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఆదివారం జేడీయూ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సీఎం నితీశ్ కుమార్ రాజీనామా వార్తల నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీతో మళ్లీ దోస్తీ చేసే విషయంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సమావేశం అనంతరం సీఎం నితీశ్ కుమార్ గవర్నర్ ను కలుస్తారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్‌ను కోరతారని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇక బీజేపీ ఇప్పటికే జేడీయూకు మద్దతు ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి సుశీల్ కుమార్‌తో పాటు మరొకరికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు నితీశ్ ఓకే చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ రోజు రాత్రి వరకు బీజేపీ ఎమ్మెల్యేలు నితీశ్ కుమార్ కు మద్దుతుగా లేఖలపై సంతకాలు చేయనున్నట్టు పేర్కొన్నాయి. బీజేపీ మద్దతు లేఖలతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్ ను కోరతారని వెల్లడించాయి. మరోవైపు ఈ వార్తలపై బీజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ స్పందించారు. మూసుకున్న తలుపులు తెరుచుకునే అవకాశం ఉందన్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చన్నారు.