తెలంగాణ (Telangana)లో బీఆర్ఎస్ (BRS)కు వ్యతిరేకంగా గాలి వీస్తుండటంతో.. సంక్షేమ పథకాల లబ్దిదారులతో పాటు ప్రజలు ఓటు వేస్తారా? లేదా? అని గుబులు మొదలైందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలతో పాటు పలు నియోజకవర్గాల్లో గ్రామ కమిటీలు సైతం మద్దతుగా తీర్మానం చేసినప్పటికీ ఓట్లుపడతాయా? లేదా? అనే భయం నేతలను వెంటాడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎక్కడ చూసినా నిరసనల సెగలు తాకుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్‌కు వారం రోజుల గడువు మాత్రమే ఉండటం.. నిరసనలు ఎదురవుతుండటం గులాబీ నేతల్లో గుబులు మొదలైందని అనుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో బీఆర్‌ఎస్ నేతలను హెచ్చరిస్తూ వెలిసిన ఫ్లెక్సీ సంచలనంగా మారింది..
నిజామాబాద్, నందిపేట (Nandipet) మండలం వెంకటేశ్వర 15వ వార్డు ఎస్సీ కాలనీలో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని స్థానికులు ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశారు. కాలనీ ఏర్పడి సుమారుగా 35 సంవత్సరాలు అవుతుందని.. అయినప్పటికీ ఇదివరకు కాలనీలో ఎటువంటి అభివృద్ధి పనులు కాలేవని ఫ్లెక్సీ ప్రదర్శిస్తే, ఆ ఫ్లెక్సీ ని కొందరు అధికార మదంతో చింపి వేసినట్టు స్థానికులు వెల్లడిస్తున్నారు. ఆగ్రహంతో ఊగిపోతున్న స్థానికులు నేతలకు సవాల్ విసిరారు.
మీకు దమ్ముంటే అభివృద్ధి చేయండి కానీ ఇలా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీల మనోభావాలను దెబ్బతీస్తే.. రానున్న కాలంలో మా కాలనీ నుంచి ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. మా గల్లీని అభివృద్ధి చేయని నాయకుడికి మా గల్లీలో ఓట్లు అడిగే హక్కు లేదు అని వెంకటేశ్వర కాలనీ వాసులు ఫ్లెక్సీ ద్వారా తెలియజేస్తున్నారు..