తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈసారి ఖమ్మం(Khammam) జిల్లా కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు(5 Mla’s) ఉండగా..కేవలం ఈ ఒక్క జిల్లా నుంచే ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఖమ్మం కాంగ్రెస్‌కు కంచుకోట. అందుకే ఇక్కడి పార్లమెంట్ సెగ్మంట్ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో పెద్ద క్యూ ఉంటుంది. గతంలో ఈ ఎంపీ స్థానం(parliament Segment) నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.
అయితే, వయసు,ఆరోగ్య కారణాల రీత్యా సోనియా రాజస్తాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దీంతో ఖమ్మంలో సోనియా పోటీ చేయడం లేదని తెలియడంతో హస్తం పార్టీలో ఆశావహుల సంఖ్య మరింత పెరిగింది. ఎవరి ప్రయత్నాలు వారు చేయడం ప్రారంభించారు. ఖమ్మం టికెట్ కోసం గాంధీ భవన్ చుట్టూ కొందరు స్థానిక నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, మొన్నటివరకు ఇక్కడి నుంచి రాహుల్, ప్రియాంక గాంధీని కూడా పోటీ చేయించాలని స్టేట్ లీడర్స్ భావించగా.. రాహుల్ వయనాడ్ నుంచి పోటీకి సిద్దమయ్యారు.
ఇక ప్రియాంక రాయ్ బరేలి నుంచి పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది.దీంతో ఖమ్మం సీటు తనకు ఇవ్వాలని మాజీ ఎంపీ, సీనియర్ నేత వీహెచ్ హన్మంత రావు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. రాజీవ్ గాంధీతో కలిసి తాను అక్కడ తిరిగానని ఆ సీటు తనకు ఇవ్వాలని కోరారు.కాగా, రేవంత్ వీహెచ్ వినతిని పట్టించుకోలేదని తెలిసింది. అయితే, ఖమ్మం సీటును తన తమ్ముడికి ఇప్పించుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తన భార్యకు ఇప్పించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఇక బంధువులకు ఇప్పించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నట్లు టాక్.
ఇకపోతే, తాజాగా మండవ వెంకటేశ్వరరావు పేరు వినిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రస్తుతం కమ్మ వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించనందున మండవకు టికెట్ ఇవ్వాలని ఆ వర్గం నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ సెలెక్ట్ కమిటీ హైకమాండ్‌కు పంపించిన క్యాండిడేట్ లిస్టులపై ఇంతవరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఎలాగైనా ఖమ్మం సీటు తమకు దక్కితే విజయం పక్కా అనే ధీమాతో పలువురు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది.