కెనడా (Canada) పై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jai Shankar) మరోసారి పరోక్ష విమర్శలు గుప్పించారు. భావ ప్రకటన స్వేచ్ఛ (Freedom Of Speech) గురించి ఇతర దేశాల నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాల్సిన అసవరం లేదని అన్నారు. ఉగ్రవాదం, హింసలను కెనడా అనుమతించడం అతి పెద్ద సమస్యల అని మరోసారి స్పష్టం చేశారు.
అమెరికా, కెనడాలకు తాను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నట్టు తెలిపారు. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశమని పేర్కొన్నారు. అందువల్ల భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఇతర దేశాల నుంచి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. భావ ప్రకటన స్చేచ్ఛ అనేది హింసను ప్రేరేపించకూడదని తాము అనుకుంటున్నట్టు చెప్పారు.
శాన్ ఫ్రాన్సిస్కో లోని భారత దౌత్య కార్యాలయంపై దాడి, కెనడాలో భారత దౌత్య వేత్తలను బెదిరిస్తూ వెలిసిన ఖలిస్తాన్ పోస్టర్లపై జైశంకర్ స్పందించారు. భారత్ స్థానం లో మీరు ఉంటే ఏం చేస్తారని కెనడాను ప్రశ్నించారు. అవి మీ దౌత్య కార్యాలయాలైతే, మీ అధికారులైతే, దాడి జరగుతుంది మీ ప్రజలపై అయితే మీరు ఎలా స్పందిస్తారని ఆయన ప్రశ్నించారు.
ఈ సమస్యపై కెనడా, భారత్ ల మధ్య చర్చలు జరగాలన్నారు. ఈ విషయంలో కెనడా సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలన్నారు. ఉగ్రవాదులకు కెనడా ఆశ్రయం కల్పిస్తుండటం ఆందోళనకరమని అన్నారు. ఈ విషయాన్ని తాను అమెరికా దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. కెనడాతో దౌత్య ప్రతిష్టంభన గురించి యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అంటోనీ బ్లింకన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ తో చర్చించానన్నారు.
మొదటి సారి వ్యక్తిగత సంభాషణల్లో , అనంతరం బహిరంగంగా కెనడా ఆరోపణలు చేసిందన్నారు. ఈ రెండు సందర్బాల్లోనూ భారత్ తన వైఖరిని స్పష్టం చేసిందన్నారు. ఘటనకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు వుంటే వాటిని భారత్ భారత్ చూడాలని కెనడా ప్రభుత్వం కోరకుంటే తాము కూడా అందుకు సిద్ధంగా వున్నామని ఆయన స్పష్టం చేశారు.