కెనడా (Canada) వివాదంపై విదేశాంగ మంత్రి జై శంకర్ (Jai Shankar) స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తాజాగా హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య విషయంలో కెనడా వ్యాఖ్యలను ఆయన మరోసారి ఖండించారు. భారత్ ఎప్పుడూ అలాంటి చర్యలకు పాల్పడదని మరోసారి స్పష్టం చేశారు. కెనడాలో పెరిగిపోతున్న వేర్పాటు వాద గ్రూపులు, హింస, తీవ్రవాదంతో ముడిపడి ఉన్న వ్యవస్థీకృత నేరాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్‌లో ఆయన మాట్లాడుతూ….. గత కొన్నేండ్లుగా కెనడాలో హింస, తీవ్రవాద ఘటనలతో పాటు వేర్పాటు వాద వ్యవస్థీకృత నేరాలు పెరిగి పోయాయని అన్నారు. ఇదంతా కేవలం రాజకీయాల ప్రయోజనాల కోసమే జరుగుతోందన్నారు. ఈ నేరాలపై కొన్ని ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ట్రూడో సర్కార్ కు చురకలంటించారు.
ఈ అంశాలన్నీ ఒక దానితో ఒకటి ముడి పడి వున్నాయని చెప్పారు. నిజ్జర్ హత్య విషయంలో ఫైవ్ ఐస్ గ్రూపు పాత్ర, సిక్కు నాయకులకు ఎఫ్ బీఐ హెచ్చరికల గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ…. తాము ఫైవ్ ఐస్ లో సభ్యులం కాదన్నారు. ఖచ్చితంగా ఎఫ్ బీఐలో భాగం కాదని చెప్పారు. అందుకే మీరు సరైన వ్యక్తిని ఈ ప్రశ్న అడగలేదని తాను భావిస్తున్నానన్నారు.
కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య గురించి కెనడా ఏదైనా స్పష్టమైన సాక్ష్యాలను సమర్పించి వుంటే భారత్ చర్య తీసుకుని ఉండేదన్నారు. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం వుందన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. భారత్ తన విధానాల ప్రకారం ఇలాంటి చర్యలకు పాల్పడదని ఆయన స్పష్టం చేశారు.