హర్యానా (Haryana) గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya)తో భారతీయ ఓబీసీ సమాఖ్య నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు సమస్యలను గవర్నర్ దృష్టికి సభ్యులు తీసుకు వెళ్లారు. కుల గణన వెంటనే చేపట్టాలని కోరారు. దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్‌ను విడుదల చేయాలన్నారు. నాన్ ఏసీ ఎక్స్ ప్రెస్ బస్సుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.
ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు అందించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుల గణన ఆధారంగా సామాజిక తరగతుల రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. ఉద్యోగాల భర్తీకి నియోజకవర్గాల వారీగా ప్రాతినిధ్యం ఉన్నప్పుడే అనమానతలు తగ్గుతాయన్నారు.
పది జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారన్నారు. ఆ తర్వాత సిబ్బంది సంఖ్యను పెంచకుండా ఆయా సిబ్బందినే సర్దుబాటు చేశారని వివరించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం, మిషన్ కాకతీయల్లో లోపాలపై సమగ్ర విచారణ కోసం ఓ కమిషన్‌ను నియమించి పూర్తి వాస్తవాలు వెల్లడించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్న వారిపై 1996 నుంచి 2023 వరకు అనేక కేసులు నమోదయ్యాయన్నారు. ఆ కేసులను ఉపసంహరించుకోవాలన్నారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఓబీసీ విభాగ చైర్మన్, హర్యానా రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్‌తో భారతీయ ఓబీసీ సమాఖ్య జాతీయ అధ్యక్షులు కే.కోటేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి ఆనం చిన్ని వెంకటేశ్వరావు, దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ పాశం యాదగిరి, ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ శివ నారాయణ, తెలంగాణ కాంగ్రెస్ ఓబిసీ వర్కింగ్ ప్రెసిడెంట్ యు.వీ.సురేశ్ యాదవ్ లతో హర్యానా ఏఐసిసి కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.