బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణపై దృష్టిసారించింది. ఇక నుంచి ఢిల్లీ, ముంబై నగరాల్లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత బాణాసంచా పేల్చకూడదని నిర్ణయించింది. రెండు నగరాల్లో తీవ్ర కాలుష్యం ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా(BCCI secretary Jay Shah) వెల్లడించారు.
ముంబై, ఢిల్లీ నగరాల్లో వాయు కాలుష్యం మరీ అధికంగా ఉందని, అందుకే ఆ నగరాల్లో ఇక నుంచి ఫైర్ వర్క్స్ ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఐసీసీకి కూడా చేరవేసినట్లు షా వెల్లడించారు. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో సౌతాఫ్రికాతో ఇండియా తలపడనున్నది. వచ్చే సోమవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా స్టేడియంలో బంగ్లాదేశ్‌తో శ్రీలంక ఆడనున్నది.
పర్యావరణ అంశాల విషయంలో తాము కట్టుబడి ఉన్నామని, అభిమానులు, స్టేక్హోల్డర్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తామని జే షా తన ప్రకటనలో తెలిపారు. శీతాకాల వచ్చేసిన నేపథ్యంలో పర్యావరణ శాఖ ఢిల్లీ ప్రజలకు వార్నింగ్ జారీ చేసింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఎలక్ట్రిక్, సీఎన్జీ, బీఎస్ -6 డీజిల్ బస్సులను మాత్రమే ఢిల్లీ నుంచి హర్యానా రూట్లలో నడిపిస్తామని సీఏక్యూఎం తెలిపింది.
మరోవైపు సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. జోరుమీదున్న దక్షిణాఫ్రికా బుధవారం జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. వరుస ఓటములతో సెమీ ఫైనల్ రేసుకు దాదాపుగా దూరమైన పాక్ ఏకపక్ష మ్యాచ్‌లో బంగ్లాను చిత్తు చేసింది. దీంతో బంగ్లా జట్టు సెమీస్ నుంచి వైదొలిగింది.