తెలంగాణ (Telangana) ప్రజల జీవన విధానంలో సమూల మార్పులు తీసుకొస్తామని అన్నారు మణిపూర్ (Manipur) మాజీ ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత ఒక్రమ్ ఇబోబి సింగ్ (Okram Ibobi Singh). రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్ నగర్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం చేశారు. టీపీసీసీ (TPCC) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్థానిక నేత వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీల గురించి ఒక్రమ్ స్వయంగా ప్రచారం నిర్వహించారు. పలు ఇళ్ల వద్దకు వెళ్లి ఆరు గ్యారెంటీ స్కీముల గురించి వివరించి కరపత్రాలను అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో తెలంగాణలో అధికారంలోకి వస్తుందన్నారు ఒక్రమ్ ఇబోబి సింగ్. ఇందిరమ్మ ఇండ్లతో పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తామని తెలిపారు. ఈ పథకం కింద తెలంగాణలో పేదలకు స్థలంతో పాటు, నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం అందిస్తామని చెప్పారు. అలాగే, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఇక, చేయూత పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా రూ.4,000 పింఛన్ ఇస్తామని చెప్పారు. పేదలకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.15,000 చెల్లిస్తామన్న ఆక్ష్న.. కౌలు రౌతులకు కూడా దీన్ని వర్తింపజేస్తామని ప్రజలకు వివరించారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం, రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు ఒక్రమ్. యువ వికాసం పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ వివరించినట్టు చెప్పారు. ఆరు గ్యారంటీ పథకాలను సామాన్య నిరుపేద ప్రజలకు తప్పకుండా అందజేస్తామన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు.