తిరుమల నడకదారిలో మరోసారి చిరుత(Leoperd) సంచారం(Movements) కలకలం రేపుతోంది. తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ నానాటికీ పెరిగిపోతుంది. నడకదారిలో వెళ్లే భక్తుల సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది. ఒక్కరోజులోనే వేల సంఖ్యలో భక్తులు నడకదారిలో స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే క్రూరమృగమైన చిరుత సంచారం గురించి తెలిసి భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
గతేడాది తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఎంతో శ్రమించి చివరకు ఆ చిరుతను బంధించారు.
సాధారణంగా తిరుమల నడకదారిలో చిరుతల సంచారం కామన్.కానీ అవి జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లోకి వచ్చేందుకు ఇష్టపడవు. భక్తులు గోవింద నామస్మరణలతో అరుస్తూ వెళ్తుంటే ఆ శబ్దాలకు భయపడి అడవుల్లోనే ఉంటాయి. అయితే, అకస్మాత్తుగా చిన్నారిపై చిరుత దాడి చేయడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో టీటీడీ భద్రతా వైఫల్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో కాలినడకన వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా గుంపులుగా వెళ్లాలని ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది.దీనికి తోడు వారి చేతికి కర్రలను అందించి మెట్ల మార్గంలో అనుమతించేవారు. ఈ క్రమంలోనే ఈనెల 26వ తేదీన అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ట్రాప్ కెమెరాలకు చిరుత కదలికలు చిక్కడంతో టీటీడీ వెంటనే అప్రమత్తమైంది. అధికారులు అలర్టుగా ఉండాలని ఆదేశించింది. మరోసారి చిరుత దాడి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సిబ్బందికి సూచించింది.