దేశంలో ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ (One Nation, One Election) ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ramnath Kovind) ఆధ్వర్యంలోని కమిటీ అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే వివిధ వర్గాలను కలుస్తూ వారి అభిప్రాయాల (Opinions)ను సేకరిస్తోంది.
ఇందులో భాగంగా న్యాయ కమిషన్‌తో పాటు రాజకీయ పార్టీలను కూడా కలిసింది. తాజాగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’అంశంపై సామాన్య ప్రజల నుంచి సలహాలు సూచనలను ఆహ్వానించింది. తాజాగా ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రజలు తమ సలహాలు, సూచనలను ప్యానెల్ వెబ్ సైట్ onoe.gov.in లేదా sc-hlc@gov.in.ద్వారా పంపాలని వెల్లడించింది.
జనవరి 15లోగా ప్రజలు తమ సూచనలు పంపాలని కమిటీ కోరింది. జనవరి 15 తర్వాత పంపే సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.
గతేడాది సెప్టెంబర్ లో కోవింద్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు శాసన, న్యాయ, ఆర్థిక నిపుణులకు కేంద్రం స్థానం కల్పించింది.
ఇప్పటి వరకు ఈ కమిటీ రెండు సార్లు సమావేశం అయింది. ప్యానెల్ ఇటీవల ఆరు జాతీయ రాజకీయ పార్టీలు, 33 రాష్ట్ర పార్టీలు, ఏడు నమోదిత గుర్తింపు లేని పార్టీలకు లేఖలు రాసింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనపై వారి అభిప్రాయాలను వెల్లడించాలని కోరింది. రెండవ సమావేశంలో లా కమిషన్ సభ్యులతో కమిటీ సమావేశం అయింది.