పాట్నాలో (Patna) బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ని (Nitish Kumar) దేశానికి రెండో గాంధీగా పేర్కొంటూ వెలిసిన పోస్టర్లు రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. జేడీ యూ (JDU) నేతలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లపై ప్రస్తుతం చర్చలు చాలా హాట్ గా సాగుతున్నాయి.
నితీష్ కుమార్‌ను రెండో గాంధీగా అభివర్ణిస్తూ వచ్చిన పోస్టర్‌పై ప్రతిపక్ష పార్టీలు కూడా ఫైరయ్యాయి. ఈ వివాదం పై స్పందించిన రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు శివానంద్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీని అవమానించవద్దని కోరారు. మహాత్మా గాంధీలాంటి వాళ్లు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుడతారని తివారీ అన్నారు.
నితీష్ కుమార్ అంటే అభిమానం ఉన్నవారు ఇలా చేసి ఉండవచ్చు అని తెలిపారు. మరోవైపు ఈ పోస్టర్లపై బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాత్మాగాంధీతో నితీశ్ కుమార్‌ను పోల్చడం హేయమని.. బీజేపీ (BJP) రాష్ట్ర అధికార ప్రతినిధి కుంతల్ కృష్ణ అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడు దశాబ్ధాలుగా వ్యతిరేకించిన నితీష్ ఇప్పుడు ఆయన ఒడిలో ప్రధాని పదవి కోసం కూర్చున్నారని ఎద్దేవా చేశారు. దేశ రాజకీయాల్లో నితీష్ కుమార్ అత్యంత అవకాశవాదని కుంతల్ కృష్ణ ఆరోపించారు.