హైదరాబాద్ (Hyderabad) బిర్యానీ అంటే నాన్ వెజ్ (Non Veg) ప్రియులకు ఎంతో ఇష్టం. లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు. ఇక ఒంటరిగా ఉన్న వారికి.. ఉద్యోగస్తులకు సమయం చాలక ఆన్లైన్లో ఆర్డర్స్ ఇచ్చి బిర్యానీలు తెప్పించుకుని తింటారు. ఇలాంటి ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిసినా.. సమయం దొరక్కపోవడంతో తప్పదు మరీ అని సమాధానం ఇస్తారు.
అయితే.. నగరంలో నివసిస్తున్న ఒక వ్యక్తి తాజాగా ఫిష్ బిర్యానీ (Fish biryani) తిందామని, జొమాటో (Zomato)లో ఆర్డరిచ్చి ఓ రెస్టారెంట్ నుంచి తెప్పించుకున్నాడు. కానీ, ఆ ఫిష్ బిర్యానీలో చనిపోయిన బొద్దింక కూడా రావడంతో కంగుతిన్నాడు. తాను కోఠీలోని గ్రాండ్ హోటల్ నుండి జొమాటో ద్వారా బిర్యానీ తెప్పించుకుంటే చనిపోయిన బొద్దింకలు వచ్చాయని తెలిపాడు.
బహుశా హోటల్ వారు నాకు అదనంగా ప్రోటీన్స్ ఇద్దామనుకుని చనిపోయిన బొద్దింకలను ఫిష్ బిర్యానీలో మిక్స్‌చేసి పంపించారని వ్యంగ్యంగా మాట్లాడాడు. ఈ పోస్టుపై నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు. ఫిర్యాదు చేయమని కొందరు సలహా ఇవ్వగా.. హోటల్ యాజమాన్యాన్ని వదలొద్దని మరికొందరు పోస్టులు పెట్టారు.
ఇక్కడ రోజూ వందల మంది తింటారు.. నేను కూడా నెలకు రెండు మూడు సార్లు అక్కడ బిర్యానీ తింటానని ఒకరు.. ఇది చాలా షాకింగ్ గా ఉందని మరొకరు పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.