వివాదాస్పదమైన హకీంపేట (Hakimpet) స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డీ హరికృష్ణ (OSD Harikrishna) స్పందించారు. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదని తెలిపారు. బాలికలు తనను డాడీ అని పిలుస్తారని.. వారందరూ తన కూతురుతో సమానమన్నారు. ఎలాంటి అధికారి కూడా లైంగిక వేధింపులు పాల్పడలేదని స్పష్టం చేశారు.
తాను మూడేళ్లుగా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో స్పెషల్ ఆఫీసర్ గా పని చేస్తున్నానని.. ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు రాలేదని వివరించారు. పేరెంట్స్ (Parents) కు కూడా తమపై ఎంతో నమ్మకం ఉందని తెలిపారు. స్కూల్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని.. కావాలనే ఇది ఎవరో వెనుక ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ డర్టీ పాలిటిక్స్ ని ప్రజలు గమనించాలని కోరారు హరికృష్ణ.
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో ఓఎస్డీ హరికృష్ణ బాలికలను కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వార్త కలకలం రేపింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత (Kavitha).. ఇలాంటివి తెలంగాణలో సహించేది లేదని సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
కవిత ట్వీట్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని వెంటనే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులతో పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్ పరిపాలనలో మహిళలపై వేధింపులను ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మంత్రి.