ఇజ్రాయెల్ (Israel) బలగాలు, పాలస్తీనాకు చెందిన హమాస్ (Hamas) మిలిటెంట్లకు మధ్య దాడుల, ప్రతి దాడులతో ఇజ్రాయెల్ యుద్దరంగంగా మారింది. తాజాగా ఆదివారం హమాస్ పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఇప్పుటి వరకు ఇరు వర్గాల పోరులో 500 మందికి పైగా మరణించారు. తమ దేశంపై హమాస్ దాడి చేసిన శనివారాన్ని బ్లాక్ డే గా ఇజ్రాయెల్ ప్రధాని బెంజ్ మన్ నెతన్యాహు ప్రకటించారు. హమాస్ మిలిటెంట్ల దాడికి ఇజ్రాయెల్ బలగాలు ప్రతీకారం తీర్చుకుంటాయని ఆయన అన్నారు.
హమాస్ పై ఇజ్రాయెల్ సైన్యం ప్రతికార దాడులు చేస్తోంది. గాజా ప్రాంతంలో హమాస్ మిలిటెంట్లపై బలగాలు ఎయిర్ స్ట్రైక్స్ జరుపుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇప్పటి వరకు 250 మందికి పైగా హమాస్ మిలిటెంట్లు మరణించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. తాజాగా లెబనాన్‌లో దాడులు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
ఇదీ ఇలా వుంటే పదుల సంఖ్యలో ఇజ్రాయెల్ సైనికులు హమాస్ మిలిటెంట్లు చేతుల్లో బంధీ అయినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రతినిధి రిచర్డ్ హెచ్ తెలిపారు. ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు రెచి పోతున్నారని వెల్లడించారు. పలు చోట్ల ఇళ్లలోకి చొరబడి సాధారణ పౌరులను మిలిటెంట్లు ఊచ కోత కోస్తున్నారని ఆయన చెప్పారు. తమ బలగాలకు, మిలిటెంట్లకు మధ్య భయంకరమైన పోరు నడుస్తోందన్నారు.
ఇజ్రాయెల్ లో తాజా పరిణామాల నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపు నిచ్చింది. ఇజ్రాయెల్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఇజ్రాయెల్ పై దాడులను నేపాల్ ప్రధాని పుష్ప కుమార్ దాహల్ ఖండించారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది నేపాలీలు తీవ్రంగా గాయపడినట్టు చెప్పారు. ఇక ఈ దాడులపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఇప్పటికే ఇజ్రాయెల్ కు తాము అండగా వుంటామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ కు వెళ్లే పలు విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ గుండా శనివారం ఇజ్రాయెల్ వందలాది రాకెట్ లాంఛర్లతో దాడులు చేశారు. దాడుల నుంచి తేరుకునే లోపే వేలాది మంది హమాస్ మిలిటెంట్లు గాజాలోకి చొరబడ్డారు. ఈ దాడుల్లో సుమారు 100 మందికి పైగా మరణించగా, వేలాది మంది గాయపడ్డారు.