తనను గెలిపిస్తే జైత్రయాత్రకు వస్తానని, లేదంటే తన శవయాత్ర చూస్తారంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి(Padi Koushik Reddy) ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్(EC) సీరియస్‌గా తీసుకుంది. ఆయన వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్(Huzurabad) ఎన్నికల అధికారిని ఆదేశించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు మంగళవారం.. హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ప్రచారంలో భాగంగా మాట్లాడిన తీరును చూసి అంతా నివ్వెరపోయారు. ‘మీరు గెలిపిస్తే విజయయాత్ర.. లేకపోతే కుటుంబంతో సహా శవయాత్ర’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. తనను గెలిపించకుంటే కుటుంబమంతా కలిసి కమలాపూర్ బస్టాండ్‌లో ఉరేసుకుంటామని హెచ్చరించారు.
తనకు ఓటేసి గెలిపించకుంటే ముగ్గురు శవాలను చూడాల్సి వస్తుందన్నారు కౌశిక్‌రెడ్డి. దీంతో ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఓటర్లను ఆయన ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ పలు పార్టీల నాయకులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఈసీ దర్యాప్తునకు ఆదేశించింది.
పాడి కౌశిక్‌రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల కోసం కౌశిక్‌రెడ్డి తన భార్యాబిడ్డలతో కలిసి నిర్విరామంగా ప్రచారం చేశారు. ఆయన కూతురు శ్రీనిక హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ చేసిన ప్రజా ఆశీర్వాద సభలో చేసిన ప్రసంగం ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, హుజూరాబాద్ నియోజిక వర్గం నుంచి బీజేపీ తరఫున ఈటల రాజేందర్ బరిలో ఉండటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.