తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగబోయే మహబూబ్ నగర్(Mahaboob Nagar) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక(MLC BY POLL) ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర కసరత్తులు చేస్తోంది.అయితే, ఈ ఉపఎన్నికకు బీజేపీ దూరంగా ఉంది. ఎందుకంటే ఆ పార్టీకి స్థానిక సంస్థల్లో పెద్దగా బలం లేకపోవడంతో దూరంగా ఉన్నట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ..ఈ ఉపఎన్నికలోనూ విజయం సాధించాలని వ్యుహాత్మక అడుగులు వేస్తోంది. అయితే,సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలెట్టింది.
ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు మొత్తం 1,439 ఓట్లు ఉండగా.. బీఆర్ఎస్‌కు 850, కాంగ్రెస్‌కు 350, బీజేపీకి 150 ఓటర్లు ఉన్నారు. మిగతా ఇతర పార్టీలు స్వతంత్రులు ఉన్నారు. మెజార్టీ ఓట్లు గులాబీ పార్టీకే ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ ఆ పార్టీని భయపెడుతోంది.
ఈ నేపథ్యంలోనే గోవాలో క్యాంపు ఏర్పాటు చేసి మరీ కేటీఆర్ ఓటర్లకు హితోపదేశం చేసినట్లు సమాచారం. అయితే, గత ప్రభుత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులకు తగిన ప్రయారిటీ ఇవ్వకపోవడం తదితర కారణాలతో మిగతా బీఆర్ఎస్ నేతలు, ఇతరులు కూడా కాంగ్రెస్‌కు ఓటేస్తారని ధీమాతో హస్తం పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ఉపఎన్నికలో ఒక్కొక్క ఓటరు తమ ఓటు వినియోగానికి రూ.4 నుంచి 5 లక్షల మేర డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.బీజేపీ దూరంగా ఉండటంతో ఆ పార్టీకి చెందిన ఓట్లు ఎవరి ఖాతాలోకి వెళతాయో కూడా తెలియాల్సి ఉంది. నేడు(గురువారం) మార్చి 28న ఎన్నికలు జరగనుండగా.. ఏప్రిల్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, బీఆర్ఎస్ తరఫున నవీన్ కుమార్, కాంగ్రెస్ నుంచి మన్నెజీవన్ రెడ్డి లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఈ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.